విష జ్వరాలతో విలవిల!

విజృంభిస్తున్న డెంగీ, మలేరియా
విశాఖ, కృష్ణా జిల్లాల్లో అత్యధిక కేసులు
ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ పడకలు ఫుల్‌
చికిత్స కోసం కృష్ణా ప్రజలు ఖమ్మం బాట

అమరావతి, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విషజ్వరాలు స్వైరవిహారం చేస్తున్నాయి. అన్ని జిల్లాల్లో డెంగీ పంజా విసురుతోంది. మలేరియా, టైఫాయిడ్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1274 డెంగీ కేసులు, 1980 మలేరియా కేసులు నమోదైనట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో వాటికి రెట్టింపు బాధితులు ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో డెంగీ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఆయా ప్రాంతాల్లో ఏ ఆస్పత్రిలో చూసినా జ్వర పీడితుల దీనావస్థలే దర్శనమిస్తున్నాయి. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో ఎప్పటిలానే జ్వరాలు ఎక్కువగా నమోదువుతున్నాయి. ఈ ఏడాది కొత్తగా అర్బన్‌, రూరల్‌ ప్రాంతాల్లోనూ కేసులు ఎక్కువయ్యాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రూరల్‌ ప్రాంతాల ప్రజలు జ్వరాలతో వణికి పోతున్నారు. ఆరోగ్యశాఖ వద్ద ఉన్న సమాచారం మేరకు రాజధాని గ్రామాల్లోనూ విషజ్వరాలు ఎక్కువగానే ఉన్నాయి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌తో వస్తున్న రోగులతో విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. కృష్ణా జిల్లాల్లోని జగ్గయ్యపేట, నందిగామ, చందర్లపాడు చుట్టుపక్కల మండలాల్లో వేల సంఖ్యలో ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారు. ఆయా మండలాలకు సమీపంలో ఉన్న ఆస్పత్రుల్లో సరిపడా పడకలు లేక విజయవాడతో పాటు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్రంలో విషజ్వరాలు విజృంభిస్తుంటే ప్రభుత్వం మాత్రం ముందస్తు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైంది. 

ఒక గ్రామంలో విషజ్వరాల ప్రభావం ఉందని తెలియగానే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు హుటాహుటిన ఆ గ్రామంలో మెడికల్‌ క్యాంపు ఏర్పాటుచేయాలి. కానీ ఏ జిల్లాల్లో కూడా వైద్యులు ఆ పని చేయడం లేదు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ పరస్థితి విషమించడంతో ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. డెంగీ, మలేరియాను గుర్తించాలంటే కచ్చితంగా రక్తపరీక్షలు చేయాలి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్‌సీల్లో రక్తపరీక్షలు నిలిచిపోయాయి. మొన్నటి వరకూ మెడాల్‌ ద్వారా పీహెచ్‌సీలో రోగులకు రక్తపరీక్షలు నిర్వహించేవారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెడాల్‌ సంస్థ కొన్ని పీహెచ్‌సీల్లో చాలా వరకూ తన సేవలు నిలిపేసింది. దీంతో పీహెచ్‌సీ వైద్యులు రోగులకు మందులివ్వడం తప్ప రోగ నిర్ధారణకు రక్తపరీక్షలు చేసే అవకాశం లేకుండా పోయింది.
 
ఆరోగ్య శాఖ లెక్కలు వేరే..
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ 1980 మలేరియా, 1274 డెంగీ, 22 చికున్‌గున్యా కేసులు మాత్రమే నమోదైనట్లు అధికారిక లెక్కలు చూపిస్తున్నారు. ఈ ఏడాది సుమారు 3 లక్షల మంది జ్వర బాధితులను స్ర్కీన్‌ చేయగా 1980 మంది మాత్రమే మలేరియా బారిన పడినట్లు అధికారులు గుర్తించారు. కానీ ఆరోగ్యశాఖ అంచనాలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేదు.

డెంగీకి దూరం ఇలా..

ఫ్లవర్‌ వాజ్‌, ఎయిర్‌ కూలర్‌ నీళ్లను నిత్యం మార్చాలి.
కాలనీ, ఇళ్లలో నిల్వ ఉండే నీటి గుంతలను పూడ్చాలి.
ప్లాస్టిక్‌ బకెట్లు, ట్యూబ్‌, టైర్లు ఇళ్లలో ఉంచవద్దు.
ఇంటిపై ఉండే ట్యాంకులకు మూతలు పెట్టాలి.
కిచన్‌లో పడేవేసే అన్నం, కూరలు, చెత్తను ఓపెన్‌గా పెట్టవద్దు
పండ్ల తొక్కలను ఇంటి పరిసర ప్రాంతంలో వేయొద్దు.
పగలు దోమ కుట్టదనే భావనతో ఉండకూడదు.
పగటి పూట శరీరం పూర్తిగా కవర్‌ అయ్యే విధంగా దుస్తులు ధరించాలి
రాత్రి పూట పడుకునే ముందు దోమ తెరను ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి.
మస్కిట్‌ రిఫిలెంట్స్‌ తప్పని సరిగ్గా వినియోగించాలి.
ఇంటి మొత్తాన్ని మస్కిటో స్ర్కీన్‌తో కవర్‌ అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
డబ్బాలు, కుండలు, మొక్కల కుండీల్లో నీరు నిల్వకుండా జాగ్రత్త పడాలి.
ప్రతి వారం డ్రై డే పాటించాలి.

డెంగీతో వణుకుతున్న గౌరవరం

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలోని గౌరవరం గ్రామంలో డెంగీ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. టాటాట్రస్ట్‌ ఆధ్వర్యంలో గ్రామంలో మంగళవారం వైద్య శిబిరం నిర్వహించారు. 450 మందికి వైద్య పరీక్షలు చేసి.. 200 మంది రక్త నమూనాలు సేకరించారు. వీరిలో ఒకరికి మలేరియా లక్షణాలు కనిపించగా 70 మందిలో టైపాయిడ్‌, మరో 70 మందిలో డెంగీ లక్షణాలను గుర్తించారు. వైద్యులు ద్ద ఆస్పత్రులకు రిఫర్‌ చేశారు. డాక్టర్‌ వరుణ్‌తేజ మాట్లాడుతూ ఈ గ్రామంలో డెంగీ కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయన్నారు. వాతావరణ మార్పులు, పారిశుధ్య లోపంతో విషజ్వరాలు వ్యాపిస్తున్నాయని చెప్పారు. కాగా ఈ శిబిరాన్ని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సందర్శించారు.