ఇవి సూపర్‌ సీడ్స్‌!

ఆంధ్రజ్యోతి (09-08-2018): పండ్లను తిని గింజలు విసిరేయడం ఎవరైనా చేసేదే. అయితే కొన్ని గింజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు న్యూట్రిషనిస్టులు. శరీరానికి అవసరమైన పోషకాలు వీటిలో సమృద్ధిగా ఉంటాయి. ఏయే గింజలు తింటే ఏయే పోషకాలు లభిస్తాయో తెలుసుకుందాం...
 
పుచ్చకాయ
వాటర్‌మెలన్‌ సీడ్స్‌ అంత టేస్టీగా ఉండకపోవచ్చు. కానీ ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. రోగనిరోధక శక్తిని ఉత్తేజితం చేస్తాయి. రక్తంలో చక్కెర నిల్వలను నియంత్రిస్తాయి. పుచ్చగింజలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని ఆరనివ్వాలి. గింజల మీది పొట్టును తొలగించాలి. మొలకెత్తిన పుచ్చగింజల్లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని స్నాక్స్‌గా తీసుకోవచ్చు. గర్భిణులు వీటిని తీసుకోకూడదు.
 
బొప్పాయి
ఈ గింజలు కొంచెం చేదుగా ఉంటాయి. శరీరానికి అవసరమైన కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ వంటివి వీటిలో పుష్కలం. బొప్పాయి గింజలు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. వీటికి కొంచెం తేనె అద్ది మాత్ర లాగా కూడా తీసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల పురుషులలో వంధ్యత్వం వచ్చే ముప్పు ఉంది. గర్భిణులు వీటిని తీసుకోకపోవడమే మంచిది.
 
గుమ్మడి
వీటిలోని మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు బ్లాడర్‌ పనితీరును మెరుగుపరుస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్లను కూడా నివారిస్తాయి. వీటిని డైరెక్టుగా లేదా సూప్‌, యోగర్ట్‌, సలాడ్‌లతో పాటు తీసుకోవచ్చు.
 
అవిసె
పోషకాలతో నిండి ఉన్న ఈ గింజలు ఆరోగ్యకరమైన డైట్‌. సలాడ్‌, పప్పు లేదా తాజా పండ్ల రసంతో తీసుకోవచ్చు. రక్తపోటు, రక్తంలో చెక్కర నిల్వలు, కొలెస్ర్టాల్‌ను తగ్గించడంలో తోడ్పడతాయి. వేగించిన అవిసె గింజలు ఆకలిని నియంత్రిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి డైట్‌.
 
పనస
వీటితో చర్మ వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చు. చర్మం ముడతలు పడడం, ఇతర చర్మ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారు పనస గింజలు తీసుకుంటే ఫలితం ఉంటుంది. పనస గింజలు రక్తహీనతను నివారిస్తాయి. ఆరోగ్యకరమైన జుట్టు కోసం, చురుకైన కంటి చూపు కోసం వీటిని తీసుకోవాలి. పనస గింజల్ని మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. పై తోలు తీసేసి తినాలి.
 
సన్‌ఫ్లవర్‌
సన్‌ఫ్లవర్‌ గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఛాతి నొప్పిని తగ్గిస్తాయి. జీర్ణవ్యవస్థ పనితీరుకు, గుండె ఆరోగ్యానికి ఉపకరిస్తాయి. ఎముకల ధృఢత్వాన్ని పెంచుతాయి. ఆస్టియోపోరోసిస్‌, ఆర్థ్రరైటిస్‌, అస్తమా వంటి వ్యాధులను నివారిస్తాయి. జుట్టు, చర్మం ఆరోగ్యానికి తోడ్పడతాయి. వీటిని స్నాక్స్‌గానూ, సలాడ్‌, చికెన్‌ రెసీపీలతోనూ తీసుకోవచ్చు.