జీతాల కోసం సిబ్బంది.. చికిత్స కోసం రోగులు

ఫీవర్‌ ఆస్పత్రిలో పోటాపోటీ నిరసనలు

గోల్నాక/హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): గత ఐదు నెలలుగా తమకు జీతాలు అందలేదని హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆస్పత్రిలో 74మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఆస్పత్రి ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. అదే సమయానికి ఆస్పత్రిలో రోగులను పరామర్శించేందుకు వచ్చిన ప్రతిపక్షాల నేతలు.. ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కొదండరాం, చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషా తదితరులు ఆందోళనకారుల వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. కొదండరాం, చాడ వెంకటరెడ్డి ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో ఫోన్లో మాట్లాడగా.. సోమవారం జీతాలు చెల్లిస్తామని ఆయన చెప్పారు. దాంతో ఆ విషయమే సిబ్బందికి చెప్పి ఆందోళనను విరమింజేయించారు. మరోవైపు వైద్యులు సమయానికి రాకపోవడంతో కొందరు రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. వారితో నేతలు మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు.