నెల రోజులు సెలవులు రద్దు

వైద్యసిబ్బందికి మంత్రి ఈటల సూచన

సూర్యాపేట/ఖమ్మం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విషజ్వరాలు ప్రబలకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోందని, రోగులకు నిరంతరం సేవలందించేందుకు వైద్య సిబ్బందికి నెల రోజుల పాటు సెలవులు రద్దు చేసినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఆరోగ్య తెలంగాణ కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని, 30 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో మురుగు కూపాలను శుభ్రం చేయిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రబలుతున్న జ్వరాలన్నీ డెంగీ కాదని, 99శాతం వైరల్‌ జ్వరాలేనని చెప్పారు. మరో నెలన్నర రోజుల పాటు జ్వరాల ప్రభావం ఉంటుందన్నారు. డెంగీ నిర్ధారణ చేసే అధికారం ప్రైవేట్‌ దవాఖానాలకు లేదని, ఎవరైనా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం సూర్యాపేట జనరల్‌ ఆస్పత్రిని మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి ఆయన పరిశీలించారు.

అనంతరం సూర్యాపేటలోని మెడికల్‌ కళాశాలను సందర్శించి, విద్యార్థులు, వైద్యులు, సిబ్బందితో సమావేశమయ్యారు. అలాగే ఖమ్మం జిల్లా ఆస్పత్రిని ఎంపీ నామా నాగేశ్వర్‌రావుతో కలిసి సందర్శించారు. వైరల్‌ జ్వరం వచ్చిన రోగులను ప్రైవేటు వైద్యులు డెంగీ వచ్చిందని భయపెడుతున్నారని, అలాంటి వైద్యులపై చర్యలు తప్పవని ఈటల హెచ్చరించారు. రాష్ట్రంలో కొత్తగా ఖమ్మం, కరీంనగర్‌, మంచిర్యాలలో 3 మెడికల్‌ కాలేజీలను కేంద్రం ఏర్పాటు చేయబోతోందని చెప్పారు.
 
ఒక బెడ్‌కు ఒకే రోగి ఉండాలి
‘ఒక పడకకు ఒకే రోగి ఉండాలి. కాని ఖమ్మం జిల్లా ఆస్పత్రిలో ప్రతి పడకకూ ఇద్దరు రోగులు ఉన్నారు. ఇలా ఉండకూడదు. 200 అదనపు పడకలను ఏర్పాటు చేయాలి. జిల్లా ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న ప్రతి విభాగాన్నీ తాత్కాలికంగా వైరల్‌ జ్వరాల కోసం వాడుకోవాలి’ అని మంత్రి ఈటల ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా జిల్లాలో వైద్యఆరోగ్యశాఖ తీసుకుంటున్న చర్యలను వివరించారు.