పసిపిల్లల పాలు లాగేశారు

గర్భిణులు, బాలింతలకు జగనన్న అమృత ‘హ్యాండ్‌’

36 లక్షల లీటర్లకు 6 లక్షల లీటర్లే
3 నెలల నుంచి ఇదే పరిస్థితి
బిల్లుల చెల్లింపులో జాప్యం..
ధర పెంచాలనీ సరఫరాదారుల డిమాండ్‌

అమరావతి, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): పసిపిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారం అందిస్తామంటూ ప్రభుత్వం అట్టహాసంగా నామకరణం చేసిన ‘జగనన్న అమృతహస్తం’ పథకం... వారికి హ్యాండ్‌ ఇచ్చింది. అంగన్‌వాడీలకు పాలు సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రాష్ట్రవ్యాప్తంగా 3 నెలల నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో 50వేలకుపైగా ఉన్న అంగన్‌వాడీలకు నెలకు 36 లక్షల లీటర్ల పాలసరఫరా అవసరం కాగా... మూడు నెలలుగా నెలకు కేవలం 6 లక్షల లీటర్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఈ 6 లక్షల లీటర్లు కేవలం 20శాతం అంగన్‌వాడీలకే సరిపోతున్నాయి. అంటే 3 నెలల నుంచి 80 శాతం అంగన్‌వాడీల్లోని తల్లీపిల్లలు పాలు అందక అవస్థలు పడుతున్నారు.
 
అమలు కాని పెంపు
అంగన్‌వాడీలకు చిత్తూరు జిల్లా మదనపల్లెలోని విజయడెయిరీ ప్లాంట్‌ నుంచి పాలు సరఫరా చేస్తున్నారు. కేఎంఎఫ్‌ (కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌) నుంచి మదనపల్లె విజయడెయిరీ పాలు సేకరిస్తోంది. ఈ మేరకు ఏపీడీడీసీఎ్‌ఫఎల్‌కు, కేఎంఎ్‌ఫకు మధ్య 2016లో కుదిరిన పాల సరఫరా ఒప్పందం 2019 అక్టోబరు 31తో ముగిసింది. ఆ తర్వాత పాల ధరలు పెంచితేనే ఒప్పందం పొడిగిస్తామని ఏపీడీడీసీఎ్‌ఫఎల్‌కు కేఎంఎఫ్‌ ప్రతినిధులు చెప్పారు. సరఫరాదారుల కోరిక మేరకు పాలధరలు పెంచే ఉద్దేశంతో మహిళా, శిశు సంక్షేమశాఖ, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ... కేఎంఎఫ్‌ ప్రతినిధులతో జనవరి 13వ తేదీన సమావేశం నిర్వహించాయి.
 
పాల ధరలు పెంచడం ద్వారా, అంగన్‌వాడీలకు పాల సరఫరా పునరుద్ధరించాలని నిర్ణయించారు. కానీ, ఇంతవరకూ అది అమలుకు నోచుకోలేదు. దీనిపై చర్చించిన అధికారులు... లీటర్‌ ఫ్లెక్సీ ప్యాకింగ్‌ పాల ధర రూ.47.5కి, టెట్రా ప్యాక్‌ ధర రూ.53కి పెంచాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఫ్లెక్సీ ప్యాకింగ్‌ లీటర్‌ పాల ధర రూ.42గా, టెట్రా ప్యాక్‌ ధర రూ.50గా ఉంది. ప్రతి నెలా చెల్లింపులు సక్రమంగా జరిపితేనే సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుందని కూడా ఈ చర్చల్లో సరఫరాదారులు చెప్పారు. దీంతో ఇందుకోసం ఏపీడీడీసీఎ్‌ఫఎల్‌ పీడీ అకౌంట్‌లో రూ.80కోట్లతో రివాల్వింగ్‌ ఫండ్‌ ఏర్పాటు చేయాలనీ అధికారులు అనుకున్నారు. కానీ ఇవేవీ కార్యరూపం దాల్చకపోవడంతో అంగన్‌వాడీల్లోని చిన్నారులు, గర్భిణులకు పోషకాహారం లభించడం లేదు.
 
కేంద్ర నిధులు వస్తున్నాయా?
కేంద్ర ప్రభుత్వ పథకమైన ఐసీడీఎస్‌ కింద రాష్ట్రాల్లో అంగన్‌వాడీల నిర్వహణ జరుగుతోంది. 70:30 నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి నిధులు ఖర్చు చేస్తున్నాయి. అయితే, రాష్ట్రం నుంచి సకాలంలో యూసీలు పంపకపోవడం వల్ల ఐసీడీఎస్‌ నిధులు సక్రమంగా రావడం లేదని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కష్టాల కారణంగా వేలకోట్ల బిల్లుల చెల్లింపులు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. దీంతో యూసీలు కేంద్రానికి సమర్పించలేకపోతున్నట్లు తెలుస్తోంది.
 
బిల్లులు చెల్లించక..
పాల బిల్లు నెలకు రూ.15 నుంచి 16 కోట్ల వరకూ ఉంటుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీటి చెల్లింపులు జరపకపోవడంతో అక్టోబరు 17వ తేదీ నాటికి రూ.77 కోట్ల బిల్లులు పేరుకుపోయాయి. దీంతో పాల సరఫరాదారులు బిల్లులు చెల్లిస్తేనే పాలు సరఫరా చేస్తామని చెప్పడంతో ఆర్థికశాఖ అప్పుడు రూ.40 కోట్ల చెల్లింపులు చేసింది. అయినప్పటికీ నవంబరులో పాల సరఫరా నిలిచిపోయింది. 36 లక్షల లీటర్లకుగాను ఆ నెలలో 6 లక్షల లీటర్లు మాత్రమే సరఫరా చేశారు. ఆ తర్వాత డిసెంబరు, జనవరిలోనూ సరఫరా స్వల్పంగా పెరిగి 25 శాతానికి చేరుకుంది. దీనికి బిల్లుల చెల్లింపులో జాప్యం ఒక కారణం కాగా, పాల ధరలు పెంచాలంటూ సరఫరాదారులు కోరడం రెండో కారణం.