‘నేను అమ్మాయినే.. అయినా మరో అమ్మాయినే పెళ్లాడాలనుకుంటున్నా..’

 

ఆంధ్రజ్యోతి(10-09-2019):డాక్టర్‌! నేను సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను. అమ్మాయినే అయినా అమ్మాయిల పట్ల తప్ప, నాకు అబ్బాయిల మీద ఆకర్ణణ కలగదు. పురుషులతో శారీరకంగా కలిస్తే నాలో మార్పు వస్తుందని ఆ ప్రయత్నం కూడా చేశాను. కానీ నాకు ఆ సమయంలో ఎలాంటి ఆనందం దక్కలేదు. దాంతో నేను అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. ఈ విషయంలో మా తల్లితండ్రులను ఒప్పించేదెలా?
- ఓ సోదరి, హైదరాబాద్‌.
 
మీ పరిస్థితిని ‘సెక్సువల్‌ ఓరియెంటేషన్‌’ అంటారు. స్వలింగ వ్యక్తులకు ఆకర్షితులవడం ఈ పరిస్థితిలో ఉంటుంది. శారీరకంగా మీరు మహిళే అయినా పురుషులను పోలిన తత్వం మీలో ఉంది. పురుష సంపర్కంలో మీకు ఎలాంటి తృప్తీ కలగలేదని అంటున్నారు. అలాంటప్పుడు వైద్యుల కౌన్సెలింగ్‌తో మిమ్మల్ని మీరు క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మార్పు వచ్చే వీలు లేదని వైద్యులు నిర్ధారిస్తే మీరు అనుకున్న విధంగా జీవితం కొనసాగించవచ్చు. మీ నిర్ణయానికి అడ్డు చెప్పే అధికారం మీ తల్లితండ్రులకు లేదు. ఈ విషయంలో అవగాహన కోసం తల్లితండ్రులను సంబంధిత వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లడం మేలు. మీ పరిస్థితిని విడమరిచి చెప్పి, సంసిద్ధం చేసే నైపుణ్యం వైద్యులకు ఉంటుంది. మిమ్మల్ని అర్థం చేసుకుని, మీ నిర్ణయాన్ని స్వాగతించే అవకాశం వారికి ఇవ్వండి. ఒకవేళ మీరు మరో స్త్రీని పెళ్లి చేసుకోవడం వల్ల ఎదురయ్యే అవమానాల గురించి వారికి భయాలు ఉంటే, ఉంటున్న ప్రదేశానికి దూరంగా, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోవచ్చు అని వారికి నచ్చచెప్పండి.
 
-డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి
ఆండ్రాలజిస్ట్‌, హైదరాబాద్‌
8332850090 (కన్సల్టేషన్‌ కోసం)