ఈ అవమానాలు ఎంతకాలం?

 

ఆంధ్రజ్యోతి (03-12-2019):

 ప్రశ్న: డాక్టర్‌! మాకు పెళ్లై మూడేళ్లు. ఇంతవరకూ పిల్లలు కలగలేదు. నాకు స్పెర్మ్‌ కౌంట్‌ తక్కువగా ఉందని పరీక్షల్లో తేలింది. హకీమ్‌ దగ్గర చికిత్స కూడా తీసుకున్నాను. అయినా ఫలితం లేదు. దాంతో మా ఆవిడ, అత్తగారు నేను నపుంసకుడిని అనీ, ఎందుకూ పనికిరాననీ అవమానపరుస్తున్నారు. దాంతో మా ఆవిడకు శారీరకంగా కూడా దగ్గర కాలేకపోతున్నాను. వాళ్లు అంటున్నట్టుగా నేను నపుంసకుడిని అనుకోవాలా?

- హుస్సేన్‌, హైదరాబాద్‌
 
డాక్టర్ సమాధానం: వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉన్నంత మాత్రాన నపుంసకులుగా భావించవలసిన అవసరం లేదు. నపుంసకత్వం అనేది లేదు, ఉండదు. అంతగా వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. మీ స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గడానికి కారణాన్ని కనిపెట్టి, చికిత్స చేస్తే పరిస్థితి మెరుగవవచ్చు. అందుకోసం వైద్యులను కలవండి. ఒకవేళ చికిత్సతో సరిదిద్దలేని సమస్య అయిన పక్షంలో ఐ.యు.ఐ (ఇంట్రా యుటెరిన్‌ ఇన్‌సెమినైజేషన్‌) ద్వారా పిల్లల కోసం ప్రయత్నించవచ్చు. కాబట్టి మీరు మీ భార్యను వెంటబెట్టుకుని వైద్యులను కలవండి. వైద్యుల మాటలతో ఆవిడ పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతారు. మున్ముందు మిమ్మల్ని సూటిపోటి మాటలు అనడం మానేస్తారు.
- డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి
ఆండ్రాలజిస్ట్‌, హైదరాబాద్‌
8332850090 (కన్సల్టేషన్‌ కోసం)