శిశువుల్లో నిద్రలేమి సాధారణం

లండన్‌, ఫిబ్రవరి 6: శిశువుల్లో నిద్రలేమి సమస్య చాలా సాధారణమని, వారికి రెండు సంవత్సరాల వయసు వచ్చేసరికి పరిస్థితి మెరుగవుతుందని ఓ అధ్యయనం వెల్లడించింది. 6నెలల వయసులో పిల్లలు నిద్రపోవడానికి తీసుకొనే సమయం సగటున 20నిమిషాలకు తగ్గుతుందని పేర్కొంది. అలాగే బిడ్డకు రెండేళ్లు వచ్చిన తర్వాత వారు సగటున రాత్రి సమయంలో ఒక్కసారి మాత్రమే మేల్కొంటారని వివరించింది. ఎనిమిది నెలల శిశువులున్న తల్లిదండ్రుల్లో దాదాపు 40శాతం మంది తమ పిల్లల నిద్ర గురించి ఆందోళన చెందుతున్నారని తెలిపింది. అయితే పసిపిల్లలు ఒకరోజులో నిద్రపోయే వ్యవధిలో వ్యక్తిగత వ్యత్యాసాలుండే అవకాశం ఉందని ఫిన్లాండ్‌కు చెందిన ఫిన్నీష్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ అండ్‌ వెల్ఫేర్‌కు చెందిన పరిశోధకులు పేర్కొన్నారు. శిశువుల నిద్రా విధానాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా మొట్టమొదటిసారిగా సుమారు 5,700మందిపై నిర్వహించిన ఈ అధ్యయనం వివరాలు ‘స్లీప్‌ మెడిసిన్‌’ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమయ్యాయి.