త్రిపుర శరణార్థి శిబిరాల్లో ఆకలి చావులు

సోమవారం 4 నెలల పసిసాప మృతి

5 రోజుల్లో ఆరుగురి మృత్యువాత

అగర్తలా, నవంబరు 4: త్రిపురలోని శరణార్థుల శిబిరాల్లో ఆకలి చావులు పెరుగుతున్నాయి. సోమవారం 4 నెలల పాప ఆకలితో కన్నుమూసింది. దీంతో ఐదు రోజుల్లో ఆకలితో చనిపోయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. మిజోరం రాష్ట్రానికి చెందిన వీరంతా జాతి ఘర్షణల కారణంగా త్రిపురలో తలదాచుకొంటున్నారు. వీరందరినీ తిరిగి మిజోరం పంపాలనే ప్రయత్నాల్లో భాగంగా కేంద్రం వీరికి అక్టోబరు నుంచి రేషన్‌ సరుకులు నిలిపివేసింది. మిజోరం వెళ్తే ఆర్థిక సహాయం చేస్తామని కూడా ప్రకటించింది. శరణార్థులు మిజోరం వెళ్లడానికి గడువును నవంబరు 30గా నిర్ణయించారు. అయితే దీనిపై శరణార్థులు ఇంకా ఎలాంటి అభిప్రాయం చెప్పలేదు. తమకు ఇప్పటివరకు ఇస్తున్న రేషన్‌, ఆర్థిక భృతిని అందించాలని ఐదురోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.