పోషకాల గనులు తృణధాన్యాలు

ఆంధ్రజ్యోతి (07-12-2019): చిరుధాన్యాలు, తృణధాన్యాలు, సిరిధాన్యాలు.. పేరేదైనా అవి పోషకాల గనులు.. ఆరోగ్యానికి సిరులు. పరిమాణంలో చిన్నవైనా ప్రయోజనాల్లో మిన్న. సంపూర్ణ ఆరోగ్యానికి చిరు ధాన్యాలే సరైన మార్గమని అందరూ తలపోస్తున్నారు. నేటి ఆధునిక జీవనంలో వండుకునేందుకు, తినేందుకు కూడా ఎవరికీ సమయం చిక్కడం లేదు. అందుకే ఏం తింటున్నారో, ఎప్పుడు తింటున్నారో, ఎంత తింటున్నారో కూడా తెలియకుండా అనారోగ్యం కొనితెచ్చుకుంటున్నారు. ఏదో ఒకటి తిని ఆకలి తీర్చుకోవడం, సమయానికి నిద్రపోకపోవడం, మానసిక ప్రశాంతత కోల్పోయి రోగాలపాలవడం ఇప్పుడు సర్వసాధారణం. వయసుతో సంబంధంలేకుండా మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, గుండెపోటు వంటి సమస్యలబారిన పడుతున్నారు చాలామంది. వీటిని దరిచేరనీయకుండా సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే సిరిధాన్యాలే తృణధాన్యాలు. మరి ఈ చిరుధాన్యాల్లో ఉన్న పోషకాలేంటో, వాటి ఉపయోగాలేంటో తెలుసుకుందాం..

ఉరుకుల పరుగుల జీవితంలో పడి మనిషి తన ఆరోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, అవిసెలు, సామలులాంటి చిరుధాన్యాహారమే మన ఆరోగ్యానికి శ్రీరామరక్ష అంటున్నారు పోషకాహార నిపుణులు. పురాతనకాలంనాటి ఈ చిరుధాన్యాహారం తింటే దీర్ఘకాలిక సమస్యలబారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చునని వారు సూచిస్తున్నారు. రోజులో కనీసం ఒకపూటైనా వీటిన ఆహారంగా తీసుకోమంటున్నారు. ఒకప్పటి అంబలి, జొన్న గటక, జొన్నరొట్టే, రాగిసంగటి మళ్ళీ పూర్వవైభవాన్ని పొందుతున్నాయంటే వాటిలోని పోషకాల విలువెంతో తెలుస్తోంది.  
 

చిరుధాన్యాలవల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. వీటిలో ఉండే ఎన్నో పోషకాలు గుండెజబ్బులు, డయాబెటీస్‌ని దరిచేరనివ్వవు. స్త్రీలల్లో వచ్చే మోనోపాజ్, రొమ్ము క్యాన్సర్‌ వంటి సమస్యలను అదుపు చేస్తాయి.

శరీరానికి అవసరమయ్యే శక్తిని ఇవ్వగలిగే పోషకపదార్ధాలు చిరుధాన్యాల్లో ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. వరి, గోధుమ, మొక్కజొన్నలను ధాన్యాలుగాను, జొన్న, కొర్ర, సజ్జ, రాగి, సామ, వరిగ మొదలైన వాటిని చిరుధాన్యాలగాను వ్యవహరిస్తారు. మధుమేహం, ఊబకాయం, కొలెస్ట్రాల్ మొదలైన జీవనశైలి రుగ్మతలను అదుపులో ఉంచడంలో ఇవి ప్రముఖపాత్ర పోషిస్తాయి.

అవిసెలు
అవిసెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తరచు వీటిని తీసుకోవడంవల్ల మధుమేహ వ్యాధి నుంచి విముక్తి లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధిని అదుపు చేయడంలో, మెదడును చురుకుగా ఉంచడంలో అవిసెలు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయంటున్నారు పోషకాహార నిపుణులు. అవిసెలకు డైలీ డైట్‌లో చోటిస్తే గుండె అలిసిపోవడం అనే సమస్యయే ఉందంటున్నారు.
 

అవిసెల్లో ఉండె కెమికల్ కాంపౌండ్స్ యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేస్తూ, శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటికి ప్రొస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్, పెద్దప్రేగులోని సమస్యలను నిరోధించగలిగే శక్తి కూడా ఉంది. రుతుక్రమ సమయాల్లో  స్త్రీల శరీరంలో వేడిని తగ్గించడంలోనూ అవిసెలు విశేషంగా పనిచేస్తాయి. ముఖ్యంగా పురుషుల్లో వీర్యవృద్ధికి అవిసె గింజలు ఎంతో దోహదపడుతాయి.

పోషకాలు అధికంగా ఉండే వీటివల్ల పిల్లల్లో శారీరక ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. రక్తంలో చక్కెర, కొవ్వు స్థాయిలను అదుపులో ఉంచుతాయి. అదేవిధంగా, స్ర్తీల నెలసరి సమస్యలకు ఈ ఆహారం చక్కని పరిష్కారం. మధుమేహ వ్యాధిగ్రస్థులు వీటిని తరచుగా తీసుకోవడం చాలా మంచిది.

కొర్రలు
ఊబకాయంతో బాధపడేవారు కొర్రలను అన్నంలా వండుకుని తింటే, ఊబకాయం సమస్య అదుపులోకి వస్తుంది. మంచి బలవర్థకమైన ఈ ఆహారంపై ప్రతిఒక్కరిలో ఇప్పుడు అవగాహన పెరిగింది. దీనివల్ల చాలామంది కొర్రలతో వంట చేసుకుని తినేందుకు ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణీలకు ఇది మంచి బలవర్ధకమైన ఆహారం. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల ద్వారా ఉదర సంబంధవ్యాధులు, గుండెసమస్యలు, కీళ్లవాతం, రక్తస్రావం వంటి సమస్యలకు దూరంగా ఉండొచ్చు. ఇందులో కూడా ఎక్కువగా ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు, ఫైబర్, మినరల్స్, కాల్షియం ఉంటాయి. వీటివల్ల శరీరానికి అదనపుశక్తి లభించడం ఖాయం. అజీర్తి సమస్యలు దూరం చేసుకోవచ్చు. అదే విధంగా మైగ్రేన్ సమస్య కూడా దూరమవుతుంది. 
 
రాగులు
చిరుధాన్యాలలో రారాజు రాగులు. వీటిని తైదలు అని కూడా పిలుస్తారు. చిన్నారులకు రాగుల ఆహారాన్ని అందిస్తే వారి పెరుగుదల అధికంగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. బియ్యం, గోధుమలకంటే రాగుల్లో కాల్షియం మెండుగా ఉంటుంది. రాగులు శరీరానికి చల్లదనాన్నిస్తాయి. బీ కాంప్లెక్స్ అధికంగా ఉండే వీటిని తీసుకోవడంవల్ల పెరుగుదల అధికంగా ఉంటుంది. వీటిని తీసుకోవడంవల్ల ఎముకలు, కండరాలు, నరాలు బలంగా మారతాయి. బాలింతల్లో పాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు, రాగులు తింటే, పేగు క్యాన్సర్‌కు దూరంగా ఉండవచ్చు. రాగి అంబలి, రాగి సంకటి, రాగి చపాతీ, రాగి పూరి...ఇలా అనేక రూపాల్లో ఎంతో రుచికరంగా ఆహారం తయారుచేసుకుని తింటారు.
 
జొన్నలు
జొన్నల్లో పోషకాలు, కాల్షియం, ప్రోటీన్లు, పీచు పదార్థాలు అధికం. ఇవి గుండెజబ్బులను దూరం చేస్తాయని వైద్య పరిశోధనల్లో తేలింది. అంతేకాదు, నరాల బలహీనత, మానసిక రుగ్మత, కాళ్లు, చేతుల మంట, నోటిపుండ్లు, వార్ధక్య రుగ్మతల నుంచి కాపాడతాయి. కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 
 
సబ్జా
సబ్జా నీరు తాగితే శరీరానికి ఎంతో ఉపశమనం కలుగుతుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకూ దోహదపడుతుంది. దాహం తీర్చడంతోపాటు ఎండ స‍మయాల్లో శరీరం డీహైడ్రేషన్‌కు లోనుకాకుండా చూస్తుంది. బరువు తగ్గేందుకూ సహకరిస్తుంది. అంతేగాక వాంతులు, అజీర్తి తొలగించేందుకు, హానికరమైన టాక్సిన్లు పొట్టలోకి చేరకుండా అడ్డుకునేందుకు, గొంతుమంట, దగ్గు, ఆస్తమా, తలనొప్పి, జ్వరం నివారణకు సబ్జా గింజల్ని నీటిలో నానబెట్టి తిన్నా, తాగినా ఫలితం ఉంటుంది. శరీరంలోని కొవ్వు శాతాన్ని ఇవి తగ్గిస్తాయి. 67.5 గ్రాముల పిండి పదార్థాలు, 11.6గ్రాముల మాంసకృతులు, 5గ్రాముల కొవ్వు పదార్థాలు, 8 మీల్లీ గ్రాముల ఇనుము, 42 మిల్లీ గ్రాముల కాల్షియం, 296 మిల్లీ గ్రాముల పాస్పరస్, 296 మిల్లా గ్రాముల థయామిన్, 0.25 మిల్లీ గ్రాముల రైబోప్లేవిన్, 2.3 మిల్లీ గ్రాముల నియాసిన్ వీటిల్లో ఉంటాయి.
 
సామలు 
ఇవి తీసుకోవడం ద్వారా ఉదర సంబంధిత వ్యాధులు దరిచేరవు. అలాగే స్ర్తీలలో రుతుక్రమం సరిగ్గా రావడానికి ఉపయోగపడతాయి. మలబద్ధకాన్ని అరికడతాయి. సీలియాక్ జబ్బు నియంత్రణకు అనువైన ఆహారం. సామలలో శక్తి, కొవ్వు, ఇనుము, పీచు అధికంగా ఉంటుంది. 
 
ఊదలు 
ఊదలు తీసుకోవడంవల్ల మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో చెక్కర స్థాయి అదుపులో ఉంటుంది. ఇందులో పిండిపదార్ధాలు, శక్తి స్థాయి తక్కువలో ఉంటుంది. అందువల్ల ఊదల ఆహారం బరువు తగ్గడానికి బాగా తోడ్పడుతుంది. శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది. ఈ ఊదలులో పీచు అధికం. వీటిని తీసుకోవడంవల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. రోగ నిరోధకశక్తిని పెంపొందించడంలో ఊదలు మంచి ప్రయోజనాన్నిస్తాయి. కూర్చుని పనిచేసేవారికి ఇది చక్కని ఆహారం.
 
సజ్జలు
సజ్జలు శరీరపెరుగుదలకు బాగా తోడ్పడతాయి. అధికశక్తినిస్తాయి.
మలబద్ధకాన్ని అరికడతాయి. సజ్జలను ఆహారంగా తీసుకుంటే, అల్సర్‌ను తగ్గించవచ్చు.
ఇందులో శక్తి, మాంసకృత్తులు ఇనుము, పీచు అధికం. గర్భిణీ స్త్రీలకు అత్యవసరమైన ఫోలిక్‌ యాసిడ్‌ సజ్జల్లో సమృద్ధిగా లభిస్తుంది. వీటిల్లో కొవ్వు, ఇనుము ఎక్కువగా ఉండటంవల్ల గర్భిణీలకు సంపూర్ణ ఆహారంగా ఉపయోగ పడతాయి. మొలకెత్తిన సజ్జలైతే మరీ మంచిది. 
 
వరిగలు : వరిగలు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మలబద్ధకాన్ని అరికట్టడంలో తోడ్పడతాయి. సీలియాక్ జబ్బుకు అనువైన ఆహారం. ఈ వరిగలలో శక్తి, పీచు అధికంగా ఉంటాయి.
 
ఆరికలు : ఈ ఆరికలు తినడంవల్ల మధుమేహం, ఊబకాయం అదుపులో ఉంటాయి. కొర్రలకన్నా ఆరికల్లో పోషక విలువలు ఎక్కువ. ఈ ఆరికల్లో ఫైబర్, ప్రోటీన్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ప్రోటీన్స్, కొవ్వుపదార్థాలు అధికంగా ఉన్న వీటిని తీసుకోవడం వల్ల సత్వర శక్తి లభిస్తుంది.
 
ఉలవలు : కిడ్నీల్లో రాళ్ళ సమస్యతో బాధపడుతున్నవారికి ఉలవలు చక్కని ఆహారం. కిడ్నీల్లో రాళ్ళు ఉన్న‌వారు ఉలవ‌లు తినాలి. వీటివ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌కశ‌క్తి పెరుగుతుంది. మూత్ర సంబంధ స‌మ‌స్య‌లు తొలగిపోతాయి. 
 
ఎన్నో ప్రయోజనాలు
చిరుధాన్యాలు పరిమాణంలో చిన్నవి, పోషకవిలువ పరంగా మాత్రం చాలా విలువైనవి. కానీ పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహారధాన్యాలు ఉత్పత్తి చేయాలనే ఉద్దేశ్యంతో చేపట్టిన హరితవిప్లవంవల్ల వరి, గోధుమ దిగబడి పెరగడం, వాడుకకు అనువుగా అందుబాటులోకి రావడంవల్ల చిరుధాన్యాల వాడకం తగ్గిపోయింది. అంతేకాకుండా చిరుధాన్యాల పొట్టు తీయడం వంటకు సిద్ధం చేయటం చాలా శ్రమతో కూడుకున్న పని కావడం మరొక కారణం.
 
పోషకాలపరంగా చిరుధాన్యాలు వేటికీ తీసిపోవు, బియ్యం, గోధుము, మొక్కజొన్న వంటి పెద్ద ధాన్యాలతో సమానంగాను పైగా కొన్ని రకాల్లో మరికాస్తా ఎక్కువగాను ఉంటాయి. బియ్యంలో కన్నా చిరుధాన్యాల్లో మాంసకృత్తులు దాదాపు రెట్టింపు మోతాదులో ఉంటాయి. చిరుధాన్యాలో విటమిన్లు ఎక్కువ. చిరుధాన్యాలతో చేసిన పదార్థాలు కాస్త గట్టిగా ఉంటాయి. వీటిని నమలటం వలన ముఖంలో కండరాలకూ మంచి వ్యాయామం లభించి తీరైన ముఖ కవళికలు వస్తాయి. చిరుధాన్యాలు అంతగా నూనె పీల్చుకోవు కాబట్టి వీటివల్ల కొవ్వు మోతాదు పెరిగే అవకాశం తక్కువ.
 
చిరుధాన్యాలలో పీచు, త్వరగా జీర్ణంకాని పిండిపదార్ధాలు ఉంటాయి. పీచు నుండి గ్లూకోజు నెమ్మదిగా విడుదలవుతుంది. అదేవిధంగా పిండిపదార్ధాలు కూడా ఆలస్యంగా జీర్ణమవ్వటం వలన త్వరగా ఆకలి కాదు. ఇది మధుమేహులకు చాలామంచిది. ఈ చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకునేవారు బరువు పెరగరు. క్యాన్సర్ నివారణకు దోహదపడతాయి అందుకని రోజులో ఏదోఒక భోజనంలో చిరుధాన్యాలను చేర్చుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇతర ధాన్యాల లాగా కాకుండా, చిరుధాన్యాలను పొట్టుతీయకుండానే వాడవచ్చు, అందువల్ల పొట్టులో ఉండే బి విటమిన్లు థయామిన్, రిబోఫ్లావిన్, నియాసిన్‌ను నష్టపోకుండా ఉంటాయి.
 
వీటిలో ఖనిజలవణాలు అయిన కాల్షియం, ఇనుము అధికంగా ఉంటాయి. ముఖ్యంగా సజ్జలలో ఫోలిక్ యాసిడ్ రాగులలో ఇనుము, కాల్షియం అధికంగా ఉండటంవల్ల గర్భిణిలకు మంచిది.
 
– ప్రవళిక వేముల