పెరుగుతున్నది పొట్టే..కండ కాదు

రెట్టింపైన గుండె జబ్బు మరణాలు!

పోషకాలు లేని ఆహారంతో రోగాలు
జీవన శైలితో ముందే హృదయ వ్యాధులు
నాలుగు మరణాల్లో 2 గుండెజబ్బుల వల్లే
‘యశోదా’ ఎండీ డాక్టర్‌ జీఎస్‌రావు
హైదరాబాద్‌ సిటీ, నవంబరు 23(ఆంధ్రజ్యోతి):గతంతో పోల్చితే గుండెజబ్బులతో బాధపడుతున్న రోగుల సంఖ్య రెట్టింపు అయ్యిందని ప్రముఖ కార్డియాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. అనారోగ్యకరమైన ఆహారం అధికంగా తీసుకుంటున్నామే తప్పా, అవసరమైన ఆహారం తగినంతగా తీసుకోవడం లేదని, దీంతో కొవ్వు పెరిగి జబ్బులను పెంచుకుంటున్నామని వారన్నారు. గుండె జబ్బులు, ఇతర వ్యాధులు రావడానికి సరైన ఆహారం, సరైన మోతాదులో తీసుకోకపోవడమేనని స్పష్టం చేశారు. యశోదా ఆస్పత్రుల ఆధ్వర్యంలో ఓ హోటల్లో అత్యాధునిక ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజీపై అంతర్జాతీయ సదస్సు శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో యశోదా ఆస్పత్రుల ఎండీ డాక్టర్‌ జీఎ్‌సరావు మాట్లాడారు.
 
గుండె, ఊపిరితిత్తుల మార్పిడిపై దృష్టి
మన దేశంలో గుండె సంబంధ రోగులు రోజురోజుకు పెరుగుతున్నారని డాక్టర్‌ జీఎస్‌ రావు చెప్పారు. ప్రతి నాలుగు మరణాల్లో గుండెకు సంబంధించినవి రెండు వరకు ఉంటున్నాయని ఆయన అన్నారు. గుండెజబ్బుల నివారణ మందులు, అత్యాధునిక చికిత్స విధానాలు జీవనప్రమాణాన్ని పెంచడానికి తోడ్పడతాయని అన్నారు. గుండె మార్పిడి చేయాల్సి వస్తే సాధ్యమైనంతవరకు దాన్ని వాయిదా వేసి, మందులు, అత్యాధునిక విధానాలతో చికిత్స అందిస్తారని పేర్కొన్నారు. అనివార్యమని భావించినప్పుడే గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేస్తారని అన్నారు. ఊపిరితిత్తులు, గుండె మార్పిడిలకు దాదాపు 8 నుంచి రూ.20 లక్షలు వ్యయమవుతుందని, అది రోగిని మానసికంగా కుంగదీస్తుందని తెలిపారు. ఆ బాధ కలగకుండా డాక్టర్లు వ్యవహరించాలని సూచించారు. యశోదా ఆస్పత్రిలో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి విభాగాల అభివృద్ధిపై దృష్టి పెట్టామని పేర్కొన్నారు. యశోదా ఆస్పత్రిలో ఇప్పటివరకు 8 ఊపిరితిత్తులు, 4 గుండె మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించామని ఆయనవెల్లడించారు.
 
దేశంలో 1990లో 15 శాతం మరణాలు గుండెజబ్బుల కారణంగా సంభవించగా, ప్రస్తుతం గుండెజబ్బు బాధితుల సంఖ్య 28 శాతానికి పెరిగినట్లుగా ఒక అధ్యయనంలో తేలిందని సీనియర్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ వరద రాజశేఖర్‌ తెలిపారు. 1990లో 2.57 కోట్ల మంది గుండె జబ్బులతో బాధపడితే 2018 నాటికి 6.39 కోట్ల మంది గుండె జబ్బుల బారినపడుతున్నారని ఆయన వివరించారు. జీవన శైలిలో మార్పుల కారణంగా రావాల్సిన వయసు కన్నా 8-10 ఏళ్ల ముందే గుండె జబ్బులు వస్తున్నాయని డాక్టర్‌ పవన్‌ గోరుకంటి తెలిపారు. గుండెపోటు, గుండె బలహీనపడడం వంటి సమస్యలతో రోగులు ఆస్పత్రులకు వస్తున్నారని ఆయన వివరించారు. క్రమం తప్పకుండా స్పీడ్‌గా వ్యాయామం చేసేవారు, శారీరక దారుఢ్యం కోసం వ్యాయామం చేసే వారు ముందుగా గుండె పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.
 
కొత్త ఆస్పత్రిలో హోటల్‌, ఫ్లాట్లు
హైటెక్‌ సిటీలో 200 పడకలతో కొత్త ఆస్పత్రిని నిర్మిస్తున్నామని యశోదా ఆస్పత్రుల ఎండీ డాక్టర్‌ జీఎ్‌సరావు తెలిపారు. అందులో ఒక ఫ్లోర్‌లో హోటల్‌, మరో ఫ్లోర్‌లో 40, 50 నివాసిత ఫ్లాట్లు ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు ఆయన చెప్పారు. విదేశీ రోగులు వచ్చి ఇతర హోటళ్లలో బస చేయకుండా ఒకే భవనంలో అన్ని ఏర్పాట్లూ చేస్తున్నామని చెప్పారు. వారి ఆహార అభిరుచులకు అనుగుణంగా మెనూ సదుపాయం కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక గుండె, ఊపిరితిత్తుల విభాగాల సదుపాయాలు ఉంటాయని పేర్కొన్నారు.
 
అందని పోషకాహారం
చాలామంది శరీరానికి కావాల్సిన అహారం కంటే అనారోగ్యకరమైన ఆహారమే ఎక్కువ తీసుకుంటున్నారని ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హేమలత అన్నారు. అనవసరమైన ఆహారం వల్ల కొవ్వు పెరుగుతుందని తద్వారా గుండెజబ్బులు, ఇతర వ్యాధులు వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. పెరుగుతున్న కొవ్వును తగ్గించుకునేందుకు వ్యాయామం చేయకపోవడం వల్ల పిన్నవయసులోనే గుండెజబ్బులు వస్తున్నాయని తెలిపారు. ఆహారంలో సూక్ష్మపోషకాలు ఉండడం లేదని, అవసరమైన ఖనిజాలు, లవణాలు లేకపోవడం వల్ల బలహీనంగా మారుతున్నారని చెప్పారు. అనవసరమైన ఆహారం వల్ల కడుపు నిండుతుందే తప్పా కండ పెరగదని అన్నారు. పోషకాహార లోపమే గుండెజబ్బులు పెరగడానికి ప్రధాన కారణమని, నిత్యం ఆహారంలో 500 గ్రాముల పండ్లు, కూరగాయాలు తప్పనిసరిగా తీసుకోవాలని డాక్టర్‌ హేమలత సూచించారు.
- డాక్టర్‌ హేమలత