నిల్వ చేసి ఆన్‌లైన్‌లో అమ్మరాదు

 

ఈ-ఫార్మసీలకు కేంద్రం మార్గదర్శకాలు
న్యూఢిల్లీ, డిసెంబరు 4: ఔషధాలను నిల్వ చేసి అమ్మరాదని, మెడికల్‌ షాపుల నుంచి అప్పటికప్పుడు కొనుగోలు చేసి వినియోగదారులకు చేరవేయాలని ప్రభుత్వం ఈ-ఫార్మసీలకు స్పష్టం చేయనుంది. ‘స్విగ్గీ, జొమాటో మొదలైన ఆన్‌లైన్‌ ఆహార సరఫరా సంస్థలు ఎలాగైతే హోటళ్లతో అవగాహనకు వచ్చి -వచ్చిన ఆర్డర్లపై అప్పటికప్పుడు ప్యాక్‌ చేసి సరఫరా చేస్తాయో ఈ-ఫార్మసీలు కూడా అదే రీతిన మందుల దుకాణాలతో అవగాహన కుదుర్చుకుని మందులను ప్రజలకు అందివ్వాలి. ఈ-ఫార్మసీలకు మందులు నిల్వ చేసుకునే అధికారం లేదు’’ అని మార్గదర్శకా ల ముసాయిదాలో కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. మాదకద్రవ్యాలు, సైకోట్రోపిక్‌ మందులు మినహా మిగిలినవి ఆన్‌లైన్లో ఆర్డర్లు తీసుకొని ప్రజలకు అందివ్వొచ్చనీ, అయితే ఏ షాపులో తీసుకున్నారో ఆ షాపు ఇచ్చే బిల్లును వినియోగదారుడికి ఇవ్వాల్సి ఉంటుందని అందులో వివరించింది. ఈ ముసాయిదాను కేంద్ర ఆరోగ్యశాఖ ఇంకా తన వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ చేయలేదు. కొన్ని మార్పులు చేశాక కొద్దిరోజుల్లో పెట్టనుంది. ఆన్‌లైన్లో విచ్చలవిడిగా మందులు అమ్మేస్తూ ఈ-ఫార్మసీలు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని చర్మవ్యాధి వైద్యుడు జహీర్‌ అహ్మద్‌ ఈ ఏడాది మార్చి లో ఢిల్లీ హైకోర్టులో కేసు వేశారు.
 
ఆన్‌లైన్‌ అమ్మకాలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి నియంత్రణలూ లేవని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. కేంద్రం కొన్ని గైడ్‌లైన్స్‌ రూపొందించే దాకా ఆన్‌లైన్‌లో విక్రయాల్ని నిషేధించింది. దీన్ని డ్రగ్స్‌ కంట్రోలర్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఇప్పటికే అమలు చేస్తున్నారు. కాగా, ఆన్‌లైన్‌ సంస్థలకు కూడా లైసెన్స్‌ తప్పనిసరి అని డ్రగ్స్‌ కంట్రోలర్‌ తాజాగా సర్య్యులర్‌ ఇవ్వడంతో ఈ-ఫార్మసీలు ఖంగుతిన్నాయి. నిజానికి ఏ ఈ-ఫార్మసీకీ ఇప్పటిదాకా లైసెన్సు లేదు. ఈ సర్య్కులర్‌ వల్ల అనేక ఈ- ఫార్మసీలు మూతపడవచ్చని ప్రచారం జరుగుతోంది. దేశవ్యాప్తంగా 50 ఈ-ఫార్మసీలున్నట్లు కేంద్రం చెబుతోంది. లైసెన్సు అనవసరమని, తాము మందులు అమ్మడం లేదని, కేవలం ప్రజలకు చేరవేస్తున్నామని ఈ-ఫార్మసీలు అంటున్నాయి. సర్క్యులర్‌ వల్ల 50 లక్షల మంది పేషెంట్లకే కాకుండా 30వేల మంది సిబ్బందికి కూడా ఉద్యోగం పోయే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించాయి. ఆన్‌లైన్‌ ద్వారా 3వేల కోట్ల మేర వ్యాపారం సాగుతోంది. 2024 నాటికి ఇది మరో 20 శాతం పెరగొచ్చని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. కేంద్రం ఇప్పటికే అన్ని రీటైల్‌ దుకాణసంస్థల యూనియన్లతో చర్చలు జరిపి మార్గదర్శకాలు రూపొందించింది.