సంతానం కోసం ఎదురుచూసే దంపతులకు శుభవార్త!

‘సరోగసీ’కి బంధువే అక్కర్లేదు: పార్లమెంట్‌ కమిటీ
 
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: సంతానం కోసం ఎదురుచూసే దంపతులకు శుభవార్త! అద్దె గర్భం (సరోగసీ) విధానం త్వరలో సరళతరం కానుంది. ఇకపై గర్భాన్ని అద్దెకిచ్చే మహిళ సమీప బంధువే కానక్కర్లేదు. ఏ మహిళ అయినా ఇష్టపూర్వకంగా ముందుకొస్తే సరోగేట్‌ తల్లిగా మారొచ్చు! ఈ మేరకు సరోగసీ (నియంత్రణ) బిల్లు-2019పై ఏర్పాటు చేసిన 23 మంది సభ్యులు గల రాజ్యసభ సెలెక్ట్‌ కమిటీ.. అద్దెగర్భం విధానంలో భారీ మార్పులు సూచించింది. సరోగసీ (నియంత్రణ) బిల్లు-2019 ప్రకారం భారతీయ దంపతులకు పెళ్లయి ఐదేళ్లు దాటిన తర్వాత పిల్లలు పుట్టకపోతే సరోగసీ విధానంలో సంతానాన్ని పొందవచ్చు.
 
అయితే వారికి గర్భాన్ని అద్దెకిచ్చే మహిళ సమీప బంధువై ఉండాలి. లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును రాజ్యసభ ఆమోదించాల్సి ఉంది. దీనిపై రాజ్యసభ గత ఏడాది నవంబరు 21న భూపేంద్ర యాదవ్‌ నేతృత్వంలోని సెలెక్ట్‌ కమిటీకి పంపింది. ఈ కమిటీ 10 సార్లు సమావేశమైంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటించింది. అనంతరం బిల్లులో 15 మార్పులను సూచించింది. ఈ మేరకు బుధవారం కమిటీ చైర్మన్‌ భూపేంద్ర యాదవ్‌ రాజ్యసభలో నివేదికను సమర్పించారు.