ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉచిత ఓపీ

రాష్ట్ర హాస్పిటల్స్‌ సంఘం పిలుపు

బర్కత్‌పుర/హైదరాబాద్‌, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్‌, కార్పొరేట్‌, నర్సింగ్‌ హోమ్స్‌ ఆసుపత్రులు రోజూ రెండు గంటలపాటు ఉచిత ఓపీ నిర్వహించాలని తెలంగాణ హాస్పిటల్స్‌ ఆండ్‌ నర్సింగ్‌ హోమ్స్‌ అసోసియేషన్‌ విజ్ఞప్తి చేసింది. విష జ్వరాలు మలేరియా, డెంగీ, టైఫాయిడ్‌, చికెన్‌ గున్యాకు గురైన రోగులంతా ప్రభుత్వాసుపత్రు లకు వెళ్తుండడంతో అక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపింది. అన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులూ పేదలకు నిత్యం రెండు గంటలు ఉచిత ఓపీ నిర్వహిస్తే బావుంటుందని అసోసియేషన్‌ నేతలు సూచించారు. మంగళవారం ఇక్కడ మీడియా సమావేశంలో అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి వై.రవీందర్‌రావు, కోశాధికారి ఎల్‌.సురే్‌షగౌడ్‌ తదితరులు మాట్లాడారు. ప్రభుత్వం ప్రైవేట్‌ ఆసుపత్రుల సేవలను వినియోగించుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. వ్యాధులపై ప్రజలకు అవగాహన కోసం అన్ని ప్రైవేట్‌ కార్పొరేట్‌ ఆసుపత్రులలో అవగాహన శిబిరాలు నిర్వహించాలని వారు కోరారు.