కాంతులీనే చర్మం కోసం...

చల్లని గాలులకు ముఖం మీది తేమ మాయమై పాలిపోయినట్టు కనిపిస్తుంది. అలాంటప్పుడు చర్మం మెరుపు తగ్గకుండా రోజ్‌వాటర్‌ ఉపయోగపడుతుంది అంటున్నారు చర్మనిపుణులు డాక్టర్‌ నిరుపమా పర్వండా. సౌందర్య పోషణలో రోజ్‌వాటర్‌ ప్రయోజనాలివి...
 
ఫేస్‌ప్యాక్‌, టోనర్‌: మేకప్‌ ఉత్పత్తుల్లో అన్నిరకాల చర్మాలకు సరిపోయేవి చాలా తక్కువ. కానీ రోజ్‌వాటర్‌ అన్నిరకాల చర్మాలకు చక్కగా సరిపోతుంది. ఇంటివద్ద రోజ్‌వాటర్‌తో తయారుచేసుకున్న ఫేస్‌ప్యాక్‌, స్క్రబ్‌తో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. రోజ్‌వాటర్‌ను టోనర్‌గా లేదా ఫేస్‌ప్యాక్స్‌తో కలిపి రాసుకుంటే ముఖం కాంతులీనుతుంది.
 
కళ్ల వాపు మాయం: నిద్ర చాలనప్పుడు కళ్లు ఉబ్బిపోయి వాచినట్టు కనిపిస్తాయి. అలాంటప్పుడు కొద్దిగా రోజ్‌వాటర్‌తో కళ్ల మీద మసాజ్‌ చేసుకుంటే కళ్ల వాపు తగ్గిపోతుంది.
 
పీహెచ్‌ బ్యాలెన్స్‌: ఈ సీజన్‌లో పొడివాతావరణం వల్ల చర్మం పీహెచ్‌ మారుతుంది. దాంతో చర్మం ఆయిలీగా అవుతుంది. రోజ్‌వాటర్‌తో ముఖాన్ని రోజుకు ఒకసారి శుభ్రం చేసుకుంటే చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి. చర్మం ఎరుపెక్కడం తగ్గిపోతుంది.