కళ్లలోనే కనిపెట్టొచ్చు!

డయాబెటిస్‌ టైప్‌-2 లక్షణాలు కంటిలోనే.. పరిశోధకుల వెల్లడి

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఆధునిక కాలంలో పట్టణం, గ్రామీణం అనే తేడా లేకుండా అనేక మందిని బాధపెడుతున్న టైప్‌-2 మధుమేహాన్ని ఇకపై ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. కంటిలో వచ్చే మార్పులతోనే దాన్ని కనిపెట్టి, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నియంత్రించవచ్చని ఫర్టీస్‌ మెమోరియల్‌ పరిశోధనా సంస్థ సీనియర్‌ డాక్టర్‌ సిబల్‌ భర్తీయ చెప్పారు. శరీరంలో ఇన్సులిన్‌ హార్మోను విడుదలపై ప్రభావం చూపే టైప్‌-2 మధుమేహాన్ని అలక్ష్యం చేస్తే మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు.

దీని వల్ల శరీరంలోని చిన్న చిన్న రక్తనాళాలన్నీ నాశనమవుతాయన్నారు. దీని ప్రాథమిక లక్షణాలు మొదట కంట్లోనే కనిపిస్తాయని చెప్పారు. తొలుత కనుచూపు మందగిస్తుందని తెలిపారు. తర్వాత కంటి రెటీనాపై తీవ్ర ప్రభావం చూపి మొత్తం చూపు కోల్పోయేందుకు దారి తీస్తుందన్నారు. పిండిపదార్థాలు తక్కువ, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే డయాబెటిస్‌ టైప్‌-2ను నియంత్రించవచ్చని వారు చెబుతున్నారు.
 
కంటిలో కనిపించే లక్షణాలు
చూపు మందగించడం; కళ్లలో నల్లమచ్చలు ఏర్పడటం; ఒకే చోట ఏకాగ్రతగా చూడలేకపోవడం.
నియంత్రణకు డాక్టర్ల సూచనలు..
రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్‌, రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవాలి; పీచుపదార్థం, ప్రొటీన్‌, విటమిన్‌-డి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా.. పిండిపదార్థాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి; ధూమపానం అలవాటు ఉంటే, వెంటనే మానేయాలి; చూపు ఎలా ఉందో తరచూ పరిశీలించుకుంటూ ఉండాలి.