హైదరాబాద్, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కేన్సర్ వ్యాధిగ్రస్తులకు ఎక్కడికక్కడ చికిత్స అందించే అంశంపై సర్కారు దృష్టి పెట్టింది. దీనిపై అధ్యయనానికి వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి ఆధ్వర్యంలో అధికారుల బృందం ఇండోర్ వెళ్లి వచ్చింది. వికేంద్రీకరణలో భాగంగా మెడికల్ అధికారులకు శిక్షణ ఇచ్చి, అన్ని జిల్లాల్లో కేన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడే పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టనున్నారు. జిల్లాస్థాయిలోనే కీమోథెరపీతో పాటు ఇంకా ఏమైనా సౌకర్యాలు, చికిత్సలు కేన్సర్ రోగులకు అందించవచ్చా అన్న అంశాలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. కేన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోందని, స్ర్కీనింగ్‌పై దృష్టి పెట్టాలని ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు సూచించారు.