జ్వరంతో ప్రసవం.. తల్లి, బిడ్డ మృతి

 

డెంగీతో రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు దుర్మరణం

ఆంధ్రజ్యోతి, 15-09-2019:ఇంట్లోకి కొత్త అతిథి రాబోతున్నారని ఆ భార్యాభర్తలు ఎంతో సంబరపడ్డారు. కానీ, అంతలోనే కాబోయే తల్లిని జ్వరం కమ్మేసింది. నెలలు నిండకుండానే ప్రసవించే స్థితికి ఆమెను తీసుకొచ్చింది. ప్రసవమైన కొద్దిసేపటికే ఆ తల్లీబిడ్డల ప్రాణాలను హరించుకుపోయి ఆ కుటుంబానికి తీరని వేదనను మిగిల్చింది. ఈ ఘటన తాండూరు ప్రభుత్వాస్పత్రిలో శనివారం జరిగింది. వికారాబాద్‌ జిల్లా కుప్పన్‌కోట్‌కు చెందిన గర్భవతి జ్యోతిబాయి కొద్ది రోజులుగా జ్వరం, కామెర్లతో బాధపడుతోంది. దాంతో ఆమెను గురువారం ఆస్పత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి విషమించిందని, హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఆలోపే.. శనివారం తెల్లవారుజామున జ్యోతిబాయి బిడ్డకు జన్మనిచ్చింది. కొద్ది గంటలకే ఆ తల్లి, బిడ్డ్డ చనిపోయారు. కాగా.. డెంగీతో రాష్ట్రవ్యాప్తంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాకు చెందిన కాటబోయిన సత్యం అనే రైతుకు ప్లేట్‌లెట్స్‌ సంఖ్య బాగా తగ్గిపోవడంతో మృతి చెందారు. ఖమ్మం జిల్లాకు చెందిన బండి లక్ష్మికి డెంగీ లక్షణాలు ఉన్నాయని వైద్యులు నిర్ధారించి, వైద్యం అందిస్తుండగా.. ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయారు. నాగర్‌ కర్నూల్‌కు చెందిన ముతాహీర్‌ 3 రోజులుగా జ్వరం, తలనొప్పితో బాధపడుతుండగా.. స్థానిక ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు. కానీ, ప్లేట్‌లేట్‌ల సంఖ్య తగ్గిపోవడంతో నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆ బాలుడు మరణించాడు.