భారతీయ పురుషులకు రొమ్ము కేన్సర్ ముప్పు

నోయిడా: విశాల్‌ రాతి.. నోయిడాకు చెందిన ఈ వ్యాపారవేత్తది ఆనందకరమైన జీవితం.. సాయంత్రం కాగానే ఆల్కహాల్‌ సేవించడం.. అందులోకి మాంసాహారం తీసుకోవడం అతడి దినచర్యలో ఓ భాగం. కొంతకాలం బాగానే సాగినా.. నాలుగు పదులు దాటిన తర్వాత ఛాతీలో తేడా కన్పించింది. రొమ్ము భాగం కొద్దిగా వాచినట్టు ఉండడంతో పాటు అక్కడ చర్మం మొత్తం నారింజ రంగులోకి మారింది. దీంతో ఆందోళన చెందిన విశాల్‌ వైద్యులను సంప్రదించాడు. వైద్య పరీక్షల తర్వాత అతడు రొమ్ము కేన్సర్‌తో బాధపడుతున్నట్లు వారు స్పష్టం చేశారు. అయితే, వ్యాధి ఇంకా ప్రారంభంలోనే ఉండడంతో చికిత్స ద్వారా విశాల్‌ ఆరోగ్యం కుదుటపడింది.
 
మహిళలకే పరిమితమా..? 
రొమ్ము కేన్సర్‌ అనగానే అది మహిళలకు మాత్రమే పరిమితమైన వ్యాధి అనే అపోహ సహజం. అయితే పురుషులకూ ఈ ముప్పు పొంచి ఉందని, ముఖ్యంగా భారతీయులకు ఈ ప్రమాదం మరింత ఎక్కువని ఇటీవలి పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. మహిళల విషయంలో ప్రతీ 30 మంది(భారతీయుల)లో ఒకరు ఈ మహమ్మారి బారిన పడుతుండగా.. పురుషుల విషయానికి వచ్చేసరికి ఇది ప్రతీ 400 మందిలో ఒకరిపై దాడిచేస్తోంది. రొమ్ము కేన్సర్‌ బాధిత పురుషులు జీవించే అవకాశం 73శాతంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
 
కారణం ఏంటి? 
మగవారిలో రొమ్ము కేన్సర్‌ రావడానికి గల కారణాలపై స్పష్టత లేదు.. అయితే జన్యు లోపాలు, ఆల్కహాల్‌, వంశపారంపర్యం, స్థూలకాయం, కాలేయ వ్యాధులు, రేడియేషన్‌, హానికారక రసాయనాల వల్ల ఈ మహమ్మారి బారిన పడుతుంటారని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా మితిమీరిన మద్యపానం వల్ల కాలేయం దెబ్బతిని, ఈస్ట్రోజన్‌(ఫిమేల్‌ హార్మోన్‌) ఉత్పత్తిపై నియంత్రణ కోల్పోతుందని వైద్యులు తెలిపారు. ఇది గైనకోమాస్టియాకు కారణమవుతోందని, దీంతో దీర్ఘకాలంలో కేన్సర్‌కు దారితీస్తోందని వివరించారు.
 
లక్షణాలు: రొమ్ము భాగంలో వాపు, ఆ ప్రాంతంలో చర్మం రంగు మారడం, ముట్టుకుంటే నొప్పి తదితర లక్షణాలు కనిపిస్తాయి.
 
గుర్తింపు, చికిత్స.. 
పురుషుల్లో రొమ్ము కేన్సర్‌ను గుర్తించడానికి ప్రత్యేకమైన పద్ధతులంటూ లేవు.. మహిళలకు చేసినట్లే భౌతిక పరీక్షలతో పాటు మమ్మోగ్రఫీ, బయాప్సీలతో కేన్సర్‌ను గుర్తించవచ్చు. చికిత్సలోనూ సీ్త్ర పురుషులకు తేడా లేదు.. శస్త్రచికిత్స, రేడియేషన్‌, కీమోథెరపీ, హార్మోన్‌ థెరపీ తదితర చికిత్సలలో రోగి శరీర తత్వాన్నిబట్టి చికిత్స ఎంపిక చేస్తామని వైద్యులు తెలిపారు.