బురదలో కూరుకుపోయిన అంబులెన్స్‌ రోడ్డుపైనే ప్రసవం

డోలీలో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఘటన
అప్పటికే మృత శిశువుకు జననం.. ఏజెన్సీలో విషాదం

పాడేరు రూరల్‌, సెప్టెంబరు 14: సరైన రోడ్డు మార్గం లేక విశాఖ ఏజెన్సీ వాసులను డోలీ కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. సకాలం లో వైద్యం అందక గిరిజన మహిళ రోడ్డుపైనే మృత శిశువును ప్రసవించింది. పాడేరు మండలం ఇరడాపల్లి పంచాయతీ వై.సంపాల గ్రామంలో శనివారం జరిగిందీ దారుణం. గ్రామానికి చెందిన వంతల జ్యోతి(45)ని కాన్పు కోసం పాడేరు తీసుకెళ్లేందుకు శనివారం ఉద యం 6 గంటలకు ఆమె భర్త తిలో అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు. వై.సంపాల గ్రామం పాడేరుకు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. పాడేరు నుంచి బయలుదేరిన అంబులెన్స్‌ వై.సంపాలకు మూడు కిలోమీటర్ల దూరంలో బురదలో కూరుకుపోయింది. 

దీంతో ఏఎన్‌ఎం పద్మ కాలినడకన గ్రామానికి బయలుదేరారు. పురుటి నొప్పులు అధికమవడంతో జ్యోతిని కుటుంబసభ్యులు డోలీలో తీసుకుని బయలుదేశారు. వీరి వెంట ఆశ కార్యకర్త కూడా బయలుదేరారు. గ్రామశివారు కు వెళ్లేసరికి నొప్పులు ఎక్కువవడంతో డోలీ దింపి రహదారి పక్కనే ఆశ కార్యకర్త ప్రసవం చేయించారు. అయితే, మృతశిశువు జన్మించింది. ప్రసవం జరిగిన కొద్దిసేపటికి ఏఎన్‌ఎం అక్కడికి చేరుకున్నా రు. కాన్పు తరువాత అందించాల్సిన వైద్యం చేసి ఏఎన్‌ఎం వెనుదిరిగారు. సకాలంలో వైద్యం అందనందునే మగశిశువు పురిటిలోనే మృతి చెందాడని కుటుంబసభ్యులు భోరుమన్నారు.