కృత్రిమ గుండెతో పదేళ్లు!

10-09-2019: ‘గుండె బలహీనంగా ఉంది. గుండె మార్పిడి చేస్తే తప్ప బతకడం కష్టం’ అన్నారు డాక్టర్లు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆపరేషన్‌ చేసి కృత్రిమ గుండెను అమర్చారు. ఇది జరిగి పదేళ్లయింది. ఇప్పటికీ ఆయన ఆరోగ్యవంతమైన జీవనం గడుపుతున్నారు. కోల్‌కతాకు చెందిన సంతోష్‌ దుగర్‌ కృత్రిమ గుండెతో సాగిస్తున్న ప్రయాణం ఇది.
గుండె బలహీనపడితే రక్తాన్ని పంపింగ్‌ చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. కోల్‌కతాకు చెందిన 63 ఏళ్ల సంతోష్‌ దుగర్‌ విషయంలోనూ అదే జరిగింది. ఆయన గుండె ఎడమ భాగం బాగా బలహీనపడింది. ఛాతీ నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన సంతోష్‌ను పరీక్షించిన వైద్యులు హార్ట్‌ఫెయిల్యూర్‌ అని, అది కూడా చివరి దశలో ఉందని చెప్పారు. దీన్ని ‘హార్ట్‌మేట్‌ 2’ అంటారు. ఇది 2000 సంవత్సరంలో జరిగింది. ఆ తరువాత పలుమార్లు హార్ట్‌ ఎటాక్‌ రావడంతో ఎడమ జఠరికకు సహాయంగా పనిచేసేందుకు ఒక పరికరాన్ని అమర్చారు. ఈ పరికరం ప్రత్యేకత ఏమిటంటే సాధారణ గుండె చేసే పనులను చేస్తుంది. గుండె మార్పిడి ఆపరేషన్‌కు ప్రత్యామ్నాయంగా ఈ పరికరాన్ని వైద్యులు సూచిస్తుంటారు. ఈ పరికరం పంప్‌ మాదిరిగా పనిచేస్తుంది. అయితే ఈ పరికరానికి ఎప్పుడూ బ్యాటరీలతో విద్యుత్‌ సరఫరా జరుగుతూ ఉండాలి. ఇందుకోసం ఒక చిన్నబ్యాగ్‌ను ఎప్పుడూ వెంట ఉంచుకోవాలి. బ్యాటరీ ఒకసారి రీచార్జ్‌ చేస్తే 12 గంటలపాటు పనిచేస్తుంది. దశాబ్దం క్రితం ఈ పరికరం ధర రూ.కోటి ఉండేది. అది కూడా అమెరికా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పరికరం రూ.5 లక్షలకే లభిస్తోంది. అందులోనూ సరికొత్తగా టెక్నాలజీతో అభివృద్ధి చేసిన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పరికరాన్ని అమర్చుకున్న వాళ్లు ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయించుకోకూడదు.