దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో విటమిన్ డి కీలకపాత్ర పోషిస్తోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. వయసు పైబడుతున్న కొద్దీ వ్యాధులు చుట్టుముట్టడం మామూలే! ముఖ్యంగా మధుమేహం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, రక్తపోటు సహా గుండె జబ్బులతో పాటూ కేన్సర్ తదితర వ్యాధులకు లోనయ్యే ప్రమాదం పెరుగుతుంది. అయితే విటమిన్ డి ఈ వ్యాధులను నివారించేందుకు తోడ్పడమే కాదు, ఇప్పటికే ఈ జబ్బుల బారిన పడ్డవారికి చికిత్సలో తోడ్పడతాయని చికాగోలోని లయోలా యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం ప్రకారం.. డెబ్బై ఏళ్లు పైబడిన వృద్ధులు రోజుకు 600 ఇంటర్నేషనల్ యూనిట్ల (ఐయూ) విటమిన్ డి తీసుకోవాలని, ఆపై వయసున్న వారు రోజుకు 800 యూనిట్లు తీసుకోవాలని పరిశోధకులు సూచిస్తున్నారు.