మరణం అంచుల్లో.... జీవన రణం.. 2 గంటలపాటు జీవక్రియలన్నీ బంద్

 

వైద్య చరిత్రలోనే తొలిసారి ఒక రోగి
విజయవంతంగా సుప్తచేతనావస్థలోకి!
అద్భుతం చేసిన అమెరికా శాస్త్రజ్ఞులు

న్యూయార్క్‌: విశ్వంలో ఎక్కడో సుదూరతీరాల్లోని గెలాక్సీలో ఉన్న ఓ గ్రహానికి మనుషులు వెళ్లాలి. కానీ, అందుకు కొన్ని కాంతి సంవత్సరాల సమయం పడుతుంది. అక్కడికి వెళ్లేలోగానే మన వ్యోమగాములు చనిపోతారు. అలా చనిపోకుండా ఉండాలంటే.. వారి శరీరాలను సస్పెండెడ్‌ యానిమేషన్‌లో ఉంచాలి. సస్పెండెడ్‌ యానిమేషన్‌ అంటే.. రిమోట్‌లో పాజ్‌ బటన్‌ నొక్కగానే టీవీ తెరపై దృశ్యాలు ఆగిపోయినట్టుగా.. వ్యోమగాముల శరీరాల్లో జీవకియ్రలన్నీ స్తంభించిపోయేలా చేయడం అన్నమాట! ఇన్నాళ్లూ సైన్స్‌ ఫిక్షన్‌ నవలలకు.. హాలీవుడ్‌ సినిమాలకు మాత్రమే పరిమితమైన ఈ అద్భుతాన్ని తాము తొలిసారి సాధించామని అమెరికాలోని మేరీలాండ్‌ వర్సిటీ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అయితే వారు దీన్ని సస్పెండెడ్‌ యానిమేషన్‌ అని కాకుండా.. ‘ఎమర్జెన్సీ ప్రిజర్వేషన్‌ అండ్‌ రిససిటేషన్‌ (ఈపీఆర్‌)’గా వ్యవహరిస్తున్నారు. కత్తిపోట్లు, తూటాగాయాలతో యూనివర్సిటీ ఆఫ్‌ మేరీలాండ్‌ మెడికల్‌ సెంటర్‌కు వస్తున్న రోగులపై వారు ఈ పరిజ్ఞానాన్ని పరీక్షిస్తున్నారు. ఆ గాయాల కారణంగా వారి శరీరాల్లోని రక్తం సగానికిపైగా కారిపోయి, హృదయ స్పందన ఆగిపోవడంతో.. వారికి చికిత్స చేయడానికి అవసరమైన సమయం దొరకదు. ఫలితంగావారు జీవించే అవకాశం ఐదు శాతం కన్నా తక్కువగా ఉంటుంది. అందుకే, మేరీలాండ్‌ వర్సిటీ శాస్త్రజ్ఞులు తమ ప్రయోగాలకు వారిని ఎంచుకున్నారు. ఇలా ఇప్పటికే ఒక వ్యక్తిని సస్పెండెడ్‌ యానిమేషన్‌లో ఉంచగలిగామని ఈ పరిశోధనకు నేతృత్వం వహిస్తున్న డాక్టర్‌ శామ్యూల్‌ టిషర్‌మ్యాన్‌ తెలిపారు.

ఈపీఆర్‌ ఇలా చేస్తారు..
కత్తిపోట్లు, తూటాగాయాలతో వచ్చేవారి శరీరాల్లోని రక్తాన్ని.. మంచులా చల్లగా ఉండే సెలైన్‌తో భర్తీచేస్తారు. హృదయ స్పందనను స్తంభింపజేస్తారు. మెదడు పనితీరును దాదాపుగా నిలిపివేస్తారు. సాధారణ శరీర ఉష్ణోగ్రతల వద్ద మన శరీరంలోని కణాలకు నిరంతరం ప్రాణవాయువు సరఫరా అవుతుండాలి. లేకపోతే ప్రాణాలు పోతాయి. కానీ, ఇలా శరీర ఉష్ణోగ్రతలను పూర్తిగా తగ్గించేయడం వల్ల కణాల్లో రసాయన స్పందనలు మందగిస్తాయి లేదా పూర్తిగా ఆగిపోతాయి. దానివల్ల వాటికి ప్రాణవాయువు అవసరం తగ్గుతుంది. మనిషి మెదడు ఆక్సిజన్‌ లేకుండా దాదాపు 5 నిమిషాలపాటు పనిచేస్తుందని అంచనా. ఆ తర్వాత కూడా ఆక్సిజన్‌ అందకపోతే దెబ్బతినడం మొదలుపెడుతుంది. అయితే, ఈపీఆర్‌ వల్ల ప్రాణవాయువు అవసరం తగ్గడంతో.. ఈపీఆర్‌ విధానంలో రోగులకు చికిత్స చేస్తున్నప్పుడు వైద్యులకు దాదాపు రెండు గంటల సమయం అదనంగా లభిస్తుంది. ఆ సమయంలో చికిత్స చేసి, ఆ తర్వాత మళ్లీ శరీర ఉష్ణోగ్రతలను సాధారణ స్థితికి చేర్చి హృదయస్పందనను పునరుద్ధరిస్తారు. ఇదీ పద్ధతి. ఈ ప్రయోగం తాలూకూ పూర్తిఫలితాలను 2020 చివరికి వెల్లడిస్తామని టిషర్‌మ్యాన్‌ తెలిపారు. తాము చేస్తున్న ప్రయోగాలు వ్యోమగాములను శనిగ్రహం వరకూ పంపడానికి కాదని.. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆస్పత్రులకు వచ్చేవారిని కాపాడేందుకేనని టిషర్‌మ్యాన్‌ స్పష్టం చేశారు.
 
కొన్ని జీవుల్లో సహజం
సుప్తచేతనావస్థను సాధించడానికి.. మనుషులంటే ఇన్ని ప్రయోగాలు చేయాల్సి వస్తోందిగానీ, అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో తమను తాము కాపాడుకోవడానికి కొన్ని జీవులు పరిణామక్రమంలో ఈ అద్భుతాన్ని సహజంగా సాధించగలిగాయి. కొన్నిరకాల గబ్బిలాలు, కామన్‌ పూర్‌విల్‌ జాతి పక్షులు, ఫ్యాట్‌ టెయిల్డ్‌ లెమూర్లు.. ఇలాంటివి ఇందుకు ఉదాహరణ.
 
అల్‌పైన్‌ మార్మోట్స్‌: ఇవి ఏడాదిలో దాదాపు 8 నెలలపాటు సుప్తావస్థలోనే ఉంటాయి. మిగతా నాలుగునెలల్లో పిల్లలను కని, మళ్లీ సుప్తావస్థలోకి వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటాయి. సుప్తావస్థలో ఉన్న సమయంలో ఇవి నిమిషానికి కేవలం 2 నుంచి 3 శ్వాసలు మాత్రమే తీసుకుంటాయి. వాటి హృదయ స్పందన వేగం.. నిమిషానికి 120సార్ల నుంచి 3-4 బీట్స్‌కు పడిపోతుంది.
 
ఫ్యాట్‌ టెయిల్డ్‌ డ్వార్ఫ్‌ లెమూర్‌: మడగాస్కర్‌ అడవుల్లో మాత్రమే కనిపించే ఈ లెమూర్లు జూన్‌/జూలైల్లో సుప్తావస్థలోకి వెళ్తాయి. నిజానికి ఆ సమయంలో అక్కడ దాదాపు 30 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలుంటాయి. కానీ, లెమూర్లకు అదే అత్యంత శీతల సమయం. ఆ సమయంలో అవి ఒక చెట్టును ఎంచుకుని అక్కడ సెటిలవుతాయి. జూన్‌ లేదా జూలై నెలలో సుప్తావస్థలోకి వెళ్లిన ఈ జీవులు.. మళ్లీ నవంబరులో మేలుకొంటాయి. పేరుకు తగినట్టుగా.. తమ తోకల్లో దాచుకున్న కొవ్వునే ఈ కాలమంతా అవి బతకడానికి ఉపయోగించుకుంటాయి. నవంబరులో మేలుకొనేసరికి 50 శాతం బరువు తగ్గిపోతాయవి.
 
కామన్‌ బాక్స్‌ టర్టిల్స్‌: ఉత్తర అమెరికాలోని దక్షిణ భాగంలో, మెక్సికోలో కనిపించే కామన్‌ బాక్స్‌ జాతి తాబేళ్లు ఏడాదిలో 77 రోజుల నుంచి 154 రోజులు సుప్తావస్థలో ఉంటాయి. ఆ సమయంలో వాటి హృదయస్పందన దాదాపుగా ఆగిపోతుంది. ప్రతి 5 నుంచి 10 నిమిషాలకు ఒకసారి మాత్రమే గుండె కొట్టుకుంటుంది. అంతేకాదు.. వాటికి చర్మం ద్వారా ఆక్సిజన్‌ను గ్రహించే లక్షణం ఉండడం వల్ల ఆ సమయంల ముక్కు ద్వారా అసలు గాలి పీల్చుకోవు. అయితే, వాటిది కూడా పూర్తిస్థాయి సుప్తావస్థ కాదు. తమ మనుగడకు హాని కలిగించే మార్పులు చుట్టూ జరుగుతుంటే.. ప్రాణాలు కాపాడుకోవడానికి చట్టుక్కున లేస్తాయి.
 
కామన్‌ పూర్‌విల్‌ పక్షులు: పక్షి జాతుల్లో సుప్తావస్థలోకి వెళ్లే ఏకైక పక్షి.. కామన్‌పూర్‌ విల్‌. ఏడాదిలో ఐదు నెలలపాటు సుప్తావస్థలో ఉంటుంది. మామూలు సమయాల్లో అది జీవించడానికి అవసరమైన శక్తిలో కేవలం 7 శాతం శక్తితోనే ఈ సమయంలో అది ప్రాణాలు నిలుపుకొంటుంది. సుప్తావస్థ నుంచి మెలకువ వచ్చాక.. దాని శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరడానికి ఏడు గంటలు పడుతుంది.
 
గబ్బిలాలు: ఎలుగుబంట్లలా వీటిలో కూడా అన్నీ సుప్తావస్థలోకి వెళ్లవు. కొన్ని జాతులవి మాత్రమే వెళ్తాయి. ఉదాహరణకు.. బిగ్‌బ్రౌన్‌ జాతి గబ్బిలాలు ఏడాదిలో సగటున 64-66 రోజులు సుప్తావస్థలో ఉంటాయి. అలాగే వదిలేస్తే 344 రోజుల వరకూ అంతే ఉండిపోతాయి. సుప్తావస్థలో వాటి గుండె కొట్టుకునే వేగం నిమిషానికి 1000 సార్ల నుంచి 25 సార్లకు పడిపోతుంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే.. ఆ సమయంలో అవి రెండు గంటలకు ఒక శ్వాస మాత్రమే తీసుకుంటాయట.