హెచ్చుతగ్గులు హెచ్చరికలే!

‘నిలకడలోనే నిమ్మళం’ అనేది వాడుకలో ఉన్న మాటే! అయితే, వైద్య అధ్యయనాల్ల్లో కూడా ఇలాంటి మాటే ఒకటి ఇటీవల వినిపిస్తోంది. జీవితానికే కాదు, హెచ్చు తగ్గులు శరీర ఆరోగ్యానికి కూడా ప్రమాదకరమే అన్నది ఆ మాటల్లోని అంతరార్థం.! ‘సర్క్యులేషన్‌’ అనే జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన సౌత్‌ కొరియా అధ్యయనకారుల వ్యాసం ఈ మాటే చెబుతోంది. చాలా మందిలో శరీర బరువు, రక్తపోటు, కొలెస్ట్రాల్‌, రక్తంలో షుగర్‌లు కొంతకాలం బాగా పెరిగిపోయి, కొద్ది రోజుల తర్వాత వాటంతట అవే తగ్గిపోతాయి. మరికొందరిలో అలా కాకుండా, తగ్గడం, పెరగడం తరచూ జరుగుతూనే ఉంటాయి. ఈ పరిణామాలు గుండెపోటుకూ, పక్షవాతానికీ దారి తీసే అవకాశాలు ఎక్కువని పరిశోధకులు చెబుతున్నారు. అంతకు ముందే, అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్‌, గుండె, నాడీ వ్యవస్థకు సంబంధించిన రుగ్మతలు ఉన్నవాళ్లే కాదు, అవేమీ లేని ఆరోగ్యవంతులు కూడా ఈ హెచ్చుతగ్గుల వల్ల గుండెపోటు, పక్షవాతం వంటి సమస్యలకు గురవుతున్నట్లు వారు గమనించారు.

 
అధ్యయనంలో భాగంగా ఇతర ఏ జబ్బూ లేని 7 లక్షల మందిని ఐదేళ్ల పాటు వారు పరిశీలించారు. ఈ అధ్యయన కాలంలో మొత్తంగా 55 వేల మంది దాకా మృత్యువు పాలయ్యారు. వారిలో సుమారు 22 వేలమంది గుండెపోటుతోనూ, 23 వేల మంది పక్షవాతంతోనూ మరిణించినట్లు వారు గమనించారు. అందువల్ల రక్తపోటు, బరువు, కొలెస్ట్రాల్‌, రక్తంలో షుగర్‌ నిల్వలు తరచూ హెచ్చుతగ్గులకు గురికావడాన్ని తేలికగా తీసుకోకూడదని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు. మూలకారణాలేమిటో తెలుసుకుని జీవన శైలి మార్పులతో పాటు, అవసరమైన వైద్యచికిత్సలు తీసుకోవడం ఒక్కటే ప్రాణాంతక సమస్యలకు గురికాకుండా చూసుకునే సరైన మార్గమని వారు చెబుతున్నారు.