డెంగీతో సర్పంచ్ మృతి

16 జిల్లాల్లో డెంగీ మృతులు
కొత్తగూడెంలో అత్యధికంగా ఏడుగురు
మృతుల్లో సర్పంచ్‌ కూడా
గాంధీలో ఆరుగురు మృత్యువాత
ఒక్కరూ చనిపోలేదంటున్న సర్కారు!
మరణాలపై అధ్యయనం ఏదీ?

హైదరాబాద్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డెంగీ, వైరల్‌ జ్వరాల తీవ్రత తగ్గడం లేదు. డెంగీ మరణాలూ సంభవిస్తున్నాయి. 16 జిల్లాల్లో ఇప్పటి వరకు 38 మంది డెంగీతో చనిపోయినట్లు సమాచారం. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏడుగురు మృతిచెందారు. ఆ తర్వాత హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో డెంగీ మరణాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో డెంగీ, వైరల్‌ మరణాలపై ఇప్పటికే శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సి ఉన్నా ఆ దిశగా సర్కారు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. డెంగీతో మరణించారా లేక ఇతర కారణాలు ఉన్నాయా అన్నది కేస్‌షీట్‌ ఆధారంగా నిర్ధారించవచ్చని వైద్యులు చెబుతున్నారు. డెంగీ మరణాల సంఖ్య పెరుగుతున్నా సర్కారు మాత్రం ఏమీ జరగనట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో డెంగీ మరణాలపై వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఏ ఒక్క ఉన్నతాధికారీ నోరు మెదపడం లేదు. దీనిపై వివరణ తీసుకునేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి ప్రయత్నించగా మాట్లాడేందుకు నిరాకరించారు.

 
డెంగీ మృతులు..
గీతా మాధురి (15), టేకులపల్లి మండలం తుమ్మల చిలక గ్రామం; సత్యం (42), మైలారం; జానీ హర్షిత్‌ (15), పాల్వంచ; తురసం కృష్ణ (37), ములకలపల్లి మండలం మూకమామిడి సర్పంచ్‌; కల్యాణ సుజాత(27), రాంపురం; నక్షత్ర (8), కొత్తగూడెం; రవి(27), పోకలగూడెం; సూర్యాపేట జిల్లా: గంగబోయిన రాములమ్మ (52), నరసింహాపురం; మోక్షిత (7), రక్షిత (4) వేపల సింగారం; జగిత్యాల జిల్లా: సొన్నాకుల జగదీశ్‌, మల్యాల; నిజామాబాద్‌ జిల్లా: సుస్మిత్‌; ఆదిలాబాద్‌ జిల్లా: అబ్దుల్‌ రెహమాన్‌(19), ఆదిలాబాద్‌; కామారెడ్డి జిల్లా: చాకలి రఘు (11), బీబీపేట్‌; నాగర్‌కర్నూల్‌ జిల్లా: పద్మ (32), యండబెట్ల; ముతీర్‌(7), నాగర్‌కర్నూల్‌; సంగారెడ్డి జిల్లా: భానురేఖ, అమీన్‌పూర్‌; హస్రిత (3), బడంపేట్‌; యాదాద్రి జిల్లా: శైలజ, ఆలేరు; గుర్రం శివకుమార్‌ (27), భువనగిరి; వరంగల్‌ జిల్లా: ఐలమ్మ(44), మనుగొండ; సిరిసిల్ల జిల్లా: గూడూరి భారతి, ఇక్కుర్తి అంజయ్య గౌడ్‌, చంద్రంపేట్‌; వనపర్తి జిల్లా: కావ్య (6), ఉప్పరపల్లి; రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు, వికారాబాద్‌ జిల్లా ముగ్గురు, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో ఇద్దరు, మంచిర్యాల జిల్లా కాసిపేటలో ఒకరు, గాంధీ ఆస్పత్రిలో ఆరుగురు డెంగీతో మరణించారు.