తక్కువ కేలరీల ఆహారంతో.. పురుషులకే ప్రయోజనం!!

వాషింగ్టన్‌, అక్టోబరు 13: తక్కువ కేలరీలున్న ఆహార పదార్థాలు మహిళలు, పురుషులపై వేర్వేరు స్థాయిల్లో ప్రభావం చూపుతున్నాయని డెన్మార్క్‌లోని కోపెన్‌హగెన్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అధ్యయనంలో భాగంగా 2000 మంది డయాబెటిస్‌-1 రోగులకు 8 వారాలపాటు తక్కువ కేలరీల ఆహార పదార్థాలు అందించారు. అనంతరం జరిపిన వైద్యపరీక్షల్లో.. మహిళల కంటే పురుషుల బరువు గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. వారి జీవక్రియ రేటు, రక్తంలో చక్కెరస్థాయి, కొవ్వు ద్రవ్యరాశి, గుండె కొట్టుకునే రేటు కూడా కొంతమేర తగ్గినట్లు వెల్లడైంది. మధుమేహం తొలిదశను ఎదుర్కొంటున్న వారిలో బరువు నియంత్రణను సానుకూల అంశంగా శాస్త్రవేత్తలు అభివర్ణించారు. ‘డయాబెటిస్‌, ఒబెసిటీ, మెటబాలిజం’ జర్నల్‌లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి.