ఆరోగ్యంతో అడుగులేద్దాం!

 

కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం!
అయితే మనతో పాటు... ఆరోగ్యాన్ని వెంట తీసుకెళ్తున్నామా?
లేదా ఆరోగ్య సమస్యలను తోడు తెచ్చుకుంటున్నామా?
ఒక్కసారి వెనక్కి తిరిగి జీవనశైలిని పరికించి చూస్తే...
బోలెడన్ని లోపాలు, పొరపాట్లు ప్రతి ఒక్కరికీ కనిపిస్తాయి!
వాటిని సరిదిద్దుకుని, వచ్చే ఏడాదిలో అవే తప్పులు దొర్లకుండా జాగ్రత్తపడదాం!
 
ఆహారం... అర్థవంతంగా!
పెరిగిన శరీర బరువు తగ్గించుకోవాలనే లక్ష్యం పెట్టుకున్నారా? అయితే అందుకు అడ్డుపడే పొరపాట్ల మీద దృష్టి పెట్టండి. తక్కువ వ్యవధిలో ఎక్కువ బరువు తగ్గాలనే కష్టసాధ్యమైన, అతిపెద్ద లక్ష్యానికి బదులుగా, సులువైన, వాస్తవికంగా సాధ్యమయ్యే వీలున్న చిన్నపాటి లక్ష్యాలను ఏర్పరుచుకోవడం ఉత్తమం. వీటి వల్ల ఆత్వవిశ్వాసం పెరగడంతో పాటు, ఆ లక్ష్యాన్ని అందుకోవాలనే పట్టుదల కూడా పెరుగుతుంది. అలాగే ఆహారంలో రుచికి బదులు పోషకాలకు ప్రాధాన్యమివ్వాలి. తాజా పదార్థాలను ఎంచుకోవాలి. ఈ నియమాలతో పాటు....
ఉదయం అల్పాహారం మానేసి సన్నబడిపోదాం అనుకుంటే అత్యాశే అవుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌ మానేస్తే, మెటబాలిజం వేగం మందగిస్తుంది. దాంతో శరీరం శక్తిని ఖర్చు చేసే సామర్ధ్యం సన్నగిల్లి బరువు తగ్గడం జరగదు. కాబట్టి ఉదయం నిద్ర లేచిన రెండు గంటల్లోగా అల్పాహారం తినేయాలి. ఆ అల్పాహారంలో తీపి ఉండకూడదు. తాజా పండ్లు, తృణధాన్యాలు, కొవ్వు తక్కువగా ఉన్న పాలు తీసుకోవచ్చు.
ఐదు గంటలకు మించి ఆహారం తీసుకోకుండా ఉండడం సరికాదు. భోజనానికి, భోజనానికీ మధ్య ఎక్కువ వ్యవధి ఇస్తే, ఆ తర్వాత తీసుకునే ఆహారం పరిమాణం పెరిగే వీలుంది. మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికీ మధ్య సాయంత్రం వేళ ఆరోగ్యకరమైన స్నాక్‌ ఒకటి తినడం అవసరం. ఆఫీసు నుంచి ఇంటికి బయల్దేరే ముందు ఇలా ఒక స్నాక్‌ తినగలిగితే ఇంటికి చేరగానే ఆకలితో భారీ స్నాక్స్‌ తినకుండా ఉండగలుగుతారు.
స్నాక్స్‌గా బిస్కెట్లకు బదులు పండ్లు, కూరగాయ ముక్కలు లాంటివి తినడం ఆరోగ్యకరం. కూరగాయ ముక్కలను డబ్బాలో నింపి, ఆఫీసుకు తీసుకువెళితే పోషకాలతో నిండిన స్నాక్స్‌గా ఉపయోగపడతాయి. బాదం, పిస్తా, వాల్‌నట్స్‌ అందుబాటులో ఉంచుకోవాలి.
రోజు మొత్తంలో ఐదు రకాల పండ్లు, ఐదు రకాల కూరగాయలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

ఒకే రకం పండ్లు కిలో కొనే బదులు, అన్ని రకాల పండ్లు కలిపి కిలో కొనడం ఉపయోగకరం.

శరీర భంగిమల్లో లోపాలు...
శరీర ఆకృతి అందరిదీ ఒకేలా ఉన్నా, కూర్చునేటప్పుడు, నడిచేటప్పుడు, పనులు చేసేటప్పుడు భంగిమల్లో తేడాలు ఉంటాయి. ఆ భంగిమలు శరీరాన్ని శ్రమకు లోనుచేసేవైతే కండరాలు, కీళ్ల నొప్పులు తప్పవు. కంప్యూటరు ముందు ఎక్కువ సమయం పని చేసేవారు, ఎక్కువ సమయం పాటు నిలబడి ఉద్యోగాలు చేసేవారు, ఇంటిపనులు చేసే మహిళలు తమకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాటిని ఇలా సరిదిద్దుకోవాలి...
కంప్యూటర్‌ మానిటర్‌ కళ్లకు సమాంతరంగా ఉండేలా కూర్చోవాలి.
పాదాలు నేల మీద ఆనించి ఉంచేటంత ఎత్తు కుర్చీనే వాడాలి.
కంప్యూటర్‌ మౌస్‌ కదిలించే చేయి మణికట్టుకు ఎత్తులో లేదా దిగువలో ఉండకుండా, సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి.
కంప్యూటర్‌ ముందు ఎక్కువ సమయం పాటు పని చేసేవారు కళ్లను తరచుగా ఆర్పుతూ ఉండాలి. ప్రతి రెండు గంటలకు ఒకసారి 10 నిమిషాల పాటు నడుస్తూ ఉండాలి.
ఇంట్లో పనులు చేసే సమయంలో బరువైన వస్తువులను చేతులతో లేపేటప్పుడు, మోకాళ్లను వంచి, కుంగి వాటిని అందుకోవాలి. ఇలా చేయడంతో బరువు నడుము మీద కాకుండా కాళ్ల మీద పడుతుంది. దాంతో నడుము పట్టేసే సమస్య తప్పుతుంది.

మరీ మెత్తగా ఉండే సోఫాలు సౌకర్యంగా అనిపించినా, వాటిలో కూర్చున్నప్పుడు తుంటి, మోకాళ్లు సమాంతరంగా ఉండవు. నడుము కుంగి, లేచేటప్పుడు మోకాళ్ల మీద శరీర బరువు పడుతుంది. దాంతో మోకాలి కీళ్లు త్వరగా అరగడం మొదలుపెడతాయి. కాబట్టి సోఫాలను కొనేటప్పుడు, పరిశీలించి కొనాలి. సాధారణ మరుగుదొడ్ల వాడకం వల్ల మోకాళ్ల మీద అధిక భారం పడే అవకాశం ఉంది. కాబట్టి వెస్టర్న్‌ టాయ్‌లెట్‌ అలవాటు చేసుకోవాలి.

వ్యాయామం అత్యవసరం!

సంపూర్ణ ఆరోగ్యానికి పోషకాహారం ఎంత అవసరమో, వ్యాయామమూ అంతే అవసరం. రోజు మొత్తంలో ఎన్నో పనులు చేస్తున్నాం, దూరాలు నడుస్తున్నాం, మెట్లు ఎక్కుతున్నాం... ఇంతకుమించి వ్యాయామం అవసరమా? అనుకుంటే పొరపాటు. వ్యాయామం గుండె వేగాన్ని పెంచాలి. చెమటలు పట్టించాలి. కండరాలను పటిష్ఠపరచాలి. కొవ్వును కరిగించాలి. కాబట్టి ప్రతి రోజూ కనీసం 40 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయాలి. అయుతే ఇందుకోసం ప్రతి ఒక్కరూ జిమ్‌కు వెళ్లాలనే నియమం లేదు. నచ్చిన ఆటలు ఆడడం, ఈత, డాన్స్‌ సాధన చేయడం, సైకిల్‌ తొక్కడం, వేగంగా నడవడం, జాగింగ్‌ లేదా రన్నింగ్‌... వీటిలో దేన్నైనా ఎంచుకోవచ్చు.
నలుగురు కలిసి కబుర్లు చెప్పుకుంటూ నాలుగు వీధులు నెమ్మదిగా చుట్టి వస్తే వాకింగ్‌ అనిపించుకోదు. నడక వేగంగా ఉండాలి. బ్రిస్క్‌ వాకింగ్‌ చేయాలి. వీలైతే నడక వేగం పెంచి, కొంత దూరం జాగింగ్‌, మరికొంత దూరం వాకింగ్‌ చేయవచ్చు. నడక అలవాటు అయిన తర్వాత పరుగు పెట్టాలి.
బరువులతో కూడిన వ్యాయామాలు త్వరితంగా కొవ్వును కరిగిస్తాయి. ఎముకలనూ పటిష్టపరుస్తాయి. క్యాల్షియం లోపానికి లోనయ్యే వీలున్న మహిళలు తప్పనిసరిగా ఈ రకం వ్యాయామాలు చేస్తే, కీళ్ల సమస్యలు త్వరగా తలెత్తవు.
వ్యాయామాలతో అధిక కొవ్వును కరిగించాలి. కండర నష్టం జరగకూడదు. కాబట్టి వ్యాయామం ముగిసిన తర్వాత కచ్చితంగా ప్రొటీన్లతో కూడిన ఆహారం తీసుకోవాలి. వారం మొత్తంలో కనీసం ఐదు రోజులు అయినా వ్యాయామం చేయాలి.

ఆరోగ్యం అప్రమత్తం!

ఎంత ఆరోగ్యకరమైన జీవనశైలిని గడుపుతున్నా వంశపారంపర్యంగా సంక్రమించే కొన్ని ఆరోగ్య సమస్యల నుంచి తప్పించుకోవడం కొంత కష్టం. మధుమేహం, ఆర్థరైటిస్‌, గుండె జబ్బులు, హార్మోనల్‌ సమస్యలు, కొన్ని రకాల కేన్సర్లు వంశపారంపర్యంగా సంక్రమించే గుణం కలిగి ఉంటాయి. ఈ కోవకు చెందినవాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలి.
30 ఏళ్లకు చేరుకున్నప్పటి నుంచి ఏడాదికి ఒకసారి టోటల్‌ బాడీ స్ర్కీనింగ్‌ చేయించుకుంటూ ఉండాలి.
అకారణంగా బరువు పెరిగినా, తగ్గినా థెరాయుడ్‌ సమస్యగా భావించి, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించాలి.
నెలసరి క్రమం తప్పడం, ఆలస్యం అవడం పి.సి.ఒడి (పాలీసిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌) లక్షణం. నిర్లక్ష్యం చేస్తే పునరుత్పత్తి సామర్ధ్యం తగ్గుతుంది. కాబట్టి నెలసరిలో ఏ కొద్ది తేడా కనిపించినా వైద్యులను కలవాలి.
మెనోపాజ్‌లోకి అడుగుపెట్టిన మహిళల్లో ఒంట్లో నుంచి వేడి ఆవిర్లు, నిద్ర పట్టకపోవడం, ఒంటి నొప్పులు లాంటి ఇబ్బందులు సహజం. వీటిని ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ మందులతో చక్కదిద్దవచ్చు. వైద్యులను కలిసి హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ గురించి తెలుసుకోవాలి.
అలాగే రక్తసంబంధీకుల్లో కేన్సర్‌ రోగులు ఉంటే, 30 ఏళ్లు దాటిన మహిళలు ఏడాదికోసారి మమ్మోగ్రామ్‌ (రొమ్ము కేన్సర్‌ను గుర్తించే పరీక్ష) తప్పనిసరిగా చేయించుకోవాలి.
కేన్సర్‌ కారక దురలవాట్లకు దూరంగా ఉండాలి.
- డాక్టర్‌ కావ్య
కన్సల్టెంట్‌ గైనకాలజిస్ట్‌, హైదరాబాద్‌.
 
అపోహలు వీడాలి!
ఆహారం గురించి మనందరిలో పలు రకాల అపోహలు ఉంటూ ఉంటాయి. ఎక్కడో విన్నదీ, మరెక్కడో చదివినదీ, వాడుకలో ఉన్నదీ... ఇలా నిజానిజాలు తెలుసుకోకుండా మనసులో నాటుకుపోయిన నమ్మకాలను ఆచరిస్తూ ఉంటాం. అలాంటి అపోహలు వదిలించుకోవడం ఎంతో అవసరం.
అపోహ: నెయ్యి తింటే లావైపోతాం!

నిజం: ఇంట్లో తయారుచేసిన తాజా నెయ్యి ఆరోగ్యకరం. ఎముకల పుష్ఠికి నెయ్యి ఎంతో అవసరం. కాబట్టి నిస్సందేహంగా నెయ్యి తినవచ్చు. నూనెకు బదులుగా కూడా వాడుకోవచ్చు.

అపోహ: పులుపు తింటే జలుబు చేస్తుంది!

నిజం: పుల్లని పండ్లలో ఉండే ‘సి’ విటమిన్‌ వ్యాధినిరోధకశక్తిని పెంచి, పలు రకాల వైర్‌సల నుంచి రక్షణ ఇస్తుంది. జలుబుకు కారణమయ్యే వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే సి విటమిన్‌ పుష్కలంగా ఉండే నిమ్మజాతి పండ్లు తింటూ ఉండాలి.

అపోహ: శాకాహారం కన్నా మాంసాహారంలోనే ప్రొటీన్లు అధికం!
నిజం: ప్రొటీన్లు పుష్కలంగా ఉండే కాయగూరలూ ఉన్నాయి. చిక్కుళ్లు, బఠాణీ, తీపి మొక్కజొన్న, మినుములు, సోయా, క్వినోవా, బచ్చలికూర, పుట్టగొడుగులు, కాలీఫ్లవర్‌, అవకాడొలలో మాంసకృత్తులు అధికం. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
 
- డాక్టర్‌ మధురిమ సిన్హా
న్యూట్రిషనిస్ట్‌, కేర్‌ హాస్పిటల్స్‌,
నాంపల్లి, హైదరాబాద్‌.