మందులు మనవే.. కానీ, అందవు!

ఫార్మా రంగంలో భారతే నంబర్‌ వన్‌

భారతీయులకు ఆ ఔషధాలు అందుబాటులో ఉండని దుస్థితి
మాజీ ఐఏఎస్‌ జయప్రకాశ్‌ నారాయణ ఆవేదన
ఇక్కడి వైద్యులు రోగిని తనిఖీ చేసే సగటు సమయం ఒక నిమిషమే
21వ శతాబ్దికి తగ్గట్టు విద్యావ్యవస్థ మారాలి
గవర్నెన్స్‌ ఇన్‌ యాక్షన్‌ కార్యక్రమంలో వక్తలు

హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 14 (ఆంధ్రజ్యోతి): సమర్థులైన పిల్లలకు చదువును అందించలేకపోవడం, చికిత్స చేస్తే ప్రాణాలు నిలబెట్టగలిగీ చికిత్స అందించకపోవడం చేయకపోవడం దారుణమని ఫౌండేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫామ్స్‌ జనరల్‌ సెక్రటరీ, మాజీ ఐఏఎస్‌ డాక్టర్‌ జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా, ఫౌండేషన్‌ ఫర్‌ డెమెక్రాటిక్‌ రిఫామ్స్‌ సంయుక్తంగా గవర్నెన్స్‌ ఇన్‌ యాక్షన్‌ పేరుతో గురువారం ఇక్కడ చర్చావేదిక నిర్వహించాయి. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన జయప్రకాశ్‌ నారాయణ.. ఆరోగ్యం, విద్య అందరికీ అత్యవసరాలని గుర్తుచేశారు. ఫార్మా రంగంలో నంబర్‌ వన్‌గా పేరుగాంచిన మనదేశంలో తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఔషధాలు తయారవుతున్నా, అవి మనకు అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య సంరక్షణలో మన దేశం ఆప్రికాలోని పేద దేశాల సరసన ఉండటం బాధాకరమన్నారు.
 
దేశ జనాభా అవసరాలు ప్రవేటు సంస్థలు తీర్చలేవన్నారు. ఇక.. పేద దేశాలు వైద్యం కోసం ఎక్కువ ఖర్చు చేస్తుండగా.. అభివృద్ధి చెందిన దేశాలు స్వచ్ఛమైన తాగునీరు, డ్రైనేజీ, పరిశుభ్రతపై ఎక్కువ దృష్టి పెడుతున్నాయని, ఫలితంగా అక్కడి ప్రజలు రోగాల బారినపడే ముప్పు తగ్గుతోందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ జెఫ్రీ హామర్‌ అన్నారు. పెద్దసంఖ్యలో ఉన్న ఇక్కడి ప్రజల ఆరోగ్య అవసరాలను ప్రభుత్వ ఆస్పత్రులు తీర్చలేవని ఆయన అభిప్రాయపడ్డారు. స్వచ్ఛత, పరిశుభ్రత, క్రిమికీటకాల నివారణ, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాఽధి నిరోధకత పెంచడం.. వంటి వాటిపై దృష్టిపెట్టడం వల్ల ప్రజలు వ్యాఽధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుందని పేర్కొన్నారు. జర్మనీలో వైద్యులు ఒక రోగిని పరీక్షించేందుకు సగటున ఆరు నిమిషాల సమయం కేటాయిస్తుండగా.. భారతదేశంలో అది కేవలం ఒక నిమిషంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పరిసరాల అపరిశుభ్రత, అనారోగ్యకరమైన ఆహార అలవాట్ల కారణంగా.. ఇతర దేశాలతో పోల్చితే ఇక్కడ టీబీ, కంటి సమస్యలు మూడు రెట్లు ఎక్కువన్నారు. ఆరోగ్యశాఖ బడ్జెట్‌లో కేటాయింపులు పెంచడం, సిబ్బంది సంఖ్యను పెంచడం, రాష్ట్రాలకు సహాయం పెంచడం మినహా ఎలాంటి పాలసీనీ రూపొందించలేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు.
 
విద్య.. ఇలా కాదు!
భారతదేశంలో అమలవుతున్న విద్యా విధానం 19వ శతాబ్దానికి తగినట్లుగా ఉందని.. దానిని సమూలంగా మార్చి 21 వ శతాబ్దానికి తగినవిధంగా తయారు చేయాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్‌ లాంట్‌ ప్రిచెట్‌ అభిప్రాయపడ్డారు. గడచిన 50 ఏళ్లలో భారత్‌లో చదువుకునే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని గుర్తుచేశారు. అభివృద్ధి చెందిన సంస్థలు కొత్తగా నేర్చుకునేందుకు ఆసక్తి చూపవని, అందువల్లే ఆయా సంస్థలు నష్టాల్లోకి వెళ్తాయన్నారు. ఎక్కువ సేపు బడిలో ఉంచం వల్ల.. విద్యార్థులు నేర్చుకునేందుకు ఆసక్తి చూపరన్నారు. ప్రభుత్వ పాలసీలు అధ్భుతంగా ఉన్నప్పటికీ ఆచరణలో లోపాల కారణంగా నిరుపయోగంగా మారుతున్నాయన్నారు. ఫిన్లాండ్‌ విద్యావ్యవస్థ విధానం ఇక్కడ పనికిరాదని.. ఆ విధానాలను భారత్‌లో ప్రవేశపెడితే తిరోగమనంలో వెళ్లే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. విద్యాచట్టాలకు, ఆచరణకు మధ్యలో ఉన్న దూరాన్ని తగ్గించాలని సూచించారు.