కీటోన్‌ పోషకాలతో బ్లడ్‌ షుగర్‌కు కళ్లెం

టొరంటో, జనవరి 8: కృత్రిమ కీటోన్‌ పోషకాల వాడకంతో రక్తంలో చక్కెర మోతాదు అదుపులోకి వస్తుందని కెనడాలోని బ్రిటీష్‌ కొలంబియా వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. ఈ ప్రయోగపరీక్షల్లో పాల్గొన్న ఆరోగ్యవంతులైన 20 మంది 10 గంటలపాటు ఉపవాసం పాటించారు. ఆ తర్వాత వారికి కీటోన్‌ పోషకాలతో కూడిన పానీయాన్ని అందించారు. అది తాగిన .. అరగంటకు 75 గ్రాముల చక్కెరతో కూడిన మరో పానీయాన్ని అందించారు. ఈక్రమంలో ప్రతీ అరగంటకు వారి రక్తంలోని చక్కెర మోతాదులో వస్తున్న మార్పులను నమోదు చేశారు. ఈవివరాల విశ్లేషణ అనంతరం కీటోన్‌ పోషకాల వాడకంతో రక్తంలో చక్కెర మోతాదు తగ్గినట్లు గుర్తించారు. అయితే మధుమేహ బాధితులపై అవి ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకునేందుకు మరి న్ని ప్రయోగపరీక్షలు జరగాల్సి ఉందన్నారు.