పెద్దాసుపత్రుల్లో స్పెషాలిటీ సేవలు

పీహెచ్‌సీల నుంచి నిపుణుల తరలింపు
గైనిక్‌, అనస్థీషియా, పీడియాట్రిక్స్‌పై ప్రభుత్వం దృష్టి
 

అమరావతి, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో స్పెషాలిటీ వైద్యుల కొరతను తీర్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న 11 బోధనాసుపత్రులు, వైద్య విధాన పరిషత్‌(ఏపీవీవీపీ) పరిధిలో ఉన్న జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో నిపుణులను అందుబాటులో ఉంచడంపై దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల్లో సబ్‌ సెంటర్లు, పీహెచ్‌సీలలో ప్రాథమిక చికిత్స తర్వాత... మెరుగైన వైద్యం కోసం సీహెచ్‌సీకి లేదా ఏరియా ఆసుపత్రికి రోగులు వెళ్తుంటారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా ఆసుపత్రి, బోధనాసుపత్రులకు రోగులు వస్తుంటారు. జిల్లా, బోధనాసుపత్రుల్లో స్పెషాలిటీ వైద్యులు ఉంటారు కాబట్టి రోగులకు నాణ్యమైన వైద్యంతో పాటు శస్త్ర చికిత్సలు కూడా జరుగుతాయి. 

 

పీహెచ్‌సీల్లో స్పెషాలిటీ డాక్టర్లు ఉన్నప్పటికీ అవసరమైన వైద్య పరికరాలు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండడం లేదు. దీంతో వారు కేవలం ఓపీలు చూడడానికే పరిమితం అవుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1300 పీహెచ్‌సీల్లో సుమారు 250 మంది వరకూ స్పెషాలిటీ వైద్యులు ఉన్నారు. మరోవైపు ఏపీవీవీపీలో 150మంది వరకూ స్పెషలిస్ట్‌ వైద్యుల కొరత ఉంది. అందుకే వారిని ఏపీవీవీపీకి తరలించడం వల్ల అక్కడ స్పెషాలిటీ సేవలను కొంతవరకూ మెరుగుపరచడం వల్ల సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం డీహెచ్‌(డైరెక్టరేట్‌ ఆఫ్‌ హెల్త్‌) పరిధిలో ఉన్న 250 మంది స్పెషాలిటీ వైద్యుల్లో సుమారు 50 మంది వరకూ గైనిక్‌, అనస్థీషియా, పీడియాట్రిక్‌ విభాగాలకు చెందిన వారు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారి సేవలను ఏపీవీవీపీలో ఉపయోగించుకోనుంది. మరోవైపు ఆరోగ్యశాఖలో సంస్కరణల కోసం నియమించిన కమిటీ కూడా ఈ మేరకు అధికారులకు సూచనలు చేసినట్లు సమాచారం. కమిటీ సభ్యులు సీఎంకు ఇచ్చే తుది నివేదికలో ఈ విషయాన్ని పొందుపరుస్తున్నట్లు తెలుస్తోంది.