భయాబెటిక్.. విస్తరిస్తున్న మధుమేహం

పదేళ్లలో రెట్టింపు సంఖ్యలో బాధితులుగర్భిణులకు పొంచి ఉన్న ముప్పు 

జీవన శైలిలో మార్పులే కారణం
నేడు వరల్డ్‌ డయాబెటిక్‌ డే
 
హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరినీ పట్టిపీడిస్తున్న మాయదారి జబ్బు మధుమేహం. జీవనశైలి, ఆహార అలవాట్లలో మార్పులు, మానసిక ఒత్తిళ్లు.. మధుమేహానికి కారణమవుతున్నాయి. గంటల కొద్దీ కుర్చీలోంచి లేవకుండా, కదలకుండా పనులు చేయడం వల్ల షుగర్‌ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వ్యాయామం లేకపోవడం, ఆల్కహాల్‌, పొగతాగడం, ఫాస్ట్‌ ఫుడ్‌ మధుమేహం పెరగడానికి కారణం అవుతున్నాయని వెల్లడిస్తున్నారు.
 
హైదరాబాద్‌లోనే అధికం
2001లో ఆరు ప్రధాన నగరాల్లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం హైదరాబాద్‌లోనే మధుమేహ బాధితులు ఎక్కువుగా (13 శాతం) ఉన్నట్లు తేలింది. గడిచిన ఇరవై ఏళ్లలో అది రెట్టింపు పెరిగిందని వైద్యులు పేర్కొంటున్నారు. 2012లో ఓ ఫార్మా కంపెనీ 1900 మంది యువకులను పరీక్షించగా 25 శాతానికి మించి ఈ జబ్బుతో బాధపడుతున్నట్లు తేలింది. వారిలో 43 శాతం మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసింది. తొమ్మిది శాతం మందికి వ్యాధి ఉన్న విషయమే తెలియదు. 
 
వయస్సు వారీగా ఇలా...
13 నుంచి 19 మధ్య వయస్సు గల వారిలో 20 శా తం, 20 నుంచి 30 వయస్సున్న వారిలో 30 శాతం, 30 నుంచి 40 వయస్సు వారిలో 40 శాతం, 40 కంటే ఎక్కువ వయస్సు వారిలో 50 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారని వైద్యులు వివరించారు. 
 
అవయవాలకు ముప్పు
మధుమేహం వచ్చిన వారికి కిడ్నీ, కళ్లు, గుండె, రక్తనాళాలు, కాళ్లు, చేతులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. చిగుళ్ల వ్యాధులువస్తాయని వైద్యులు తెలిపారు. 
 
గర్భిణులపై ప్రభావం
ప్రతీ వంద మందిలో పది మంది గర్భిణులు డయాబెటిక్‌తో బాధపడుతున్నారని వివరించారు.  నిలోఫర్‌, పెట్లబురుజు, సుల్తాన్‌బజార్‌ ఆస్పత్రుల్లో ప్రసవాల కోసం వచ్చిన వారిని పరిశీలిస్తే విషయం స్పష్టమైంది.  
 
డెస్క్‌వర్క్‌ చేసే వారిలో...
కంప్యూటర్‌, ఇంటర్నెట్‌తో ఎక్కువ సేపు పని చేసేవారు, డెస్క్‌వ ర్క్‌, ఏసీలోనే ఎక్కువ సమయం గడిపే వారికి మధుమేహం వచ్చే అవకాశాలున్నాయి. ఏడాది క్రి తం ఆరు కార్పొరేట్‌ సంస్థల్లో  పని చేసే రెండు వేల మంది ఉద్యోగస్తులను పరీక్షించగా అందులో 900 మంది వరకూ వ్యాధి ఉందని తేలింది.
 
బ్రెయిన్‌ స్ట్రోక్‌ 
మధుమేహ రోగులకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ ప్రమాదం ఇతరుల కంటే మూడు రెట్లు అధికంగా ఉంటుందని వైద్యు లు చెబుతున్నారు. కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశాలు నాలుగు రెట్లు, అంధత్వం ఎనిమిది రెట్లు, 32 రెట్లు పా దాలకు ప్రమాదం పొంచి ఉంది. గుండె జబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 
 
ముందే గుర్తిస్తే ముప్పు తక్కువ
ప్రీ-డయాబెటిస్‌ దశలో ఉన్నప్పుడు వ్యాధిని గుర్తిస్తే దానిని పూర్తిగా నివారించే అవకాశం ఉంటుంది. ప్రీ డయాబెటిక్‌ దశలో 7 నుంచి పది శాతం వరకు శరీర బరువు తగ్గించుకుంటే వ్యాధి ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. నడుము చుట్టు కొలత పెరగడానికి కారణమయ్యే కొవ్వు డయాబెటి్‌సకు దారి తీస్తుంది. పురుషుల నడుము చుట్టు కొలత 90 సెంటిమీటర్లకు మించకుండా, మహిళల నడుము చుట్టు కొలత 80 సెంటిమీటర్లకు మించకుండా జాగ్రత్త పడాలి. ప్రీ డయాబెటిస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయితే వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలి. 
 
పానీయాలతో ముప్పు అధికం
ఓ అధ్యయనం ప్రకారం శీతల, పాలతో కూడిన తీపి పానీయాలు ఎక్కువుగా తీసుకునే వారు మధుమేహం బారిన పడే అవకాశం ఉంది. తీపి పానీయాలకు ప్రత్యామ్నాయంగా తగిన మోతాదులో ఆహారాన్ని తీసుకోవడం వల్ల డయాబెటిక్‌కు దూరంగా ఉండవచ్చు. 
- డాక్టర్‌ టీఎన్‌జే రాజేష్‌, ఇంటర్నెల్‌ మెడిసిన్‌, స్టార్‌ హాస్పిటల్స్‌
 
కుటుంబ సభ్యులందరూ పరీక్ష చేయించుకోవాలి
 ఈ ఏడాది డయాబెటిస్‌ థీమ్‌ ప్రకారం రోగి ఒక్కరే కాదు.. కుటుంబం మొత్తం నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. మధుమేహం ఎందుకు వచ్చింది.. ఏం చేయాలి అనే అంశాలపై కుటుంబ సభ్యులతో చర్చించాలి. ఏం తినాలి, ఏదీ తినకూడదు అనేది వైద్యుడ్ని సంప్రదించి తెలుసుకోవాలి. ఆహార విధానాలను ఒక్కసారిగా మార్పు చేయరాదు. వాట్సాప్‌ అంశాలను పరిగణనలోకి తీసుకోవద్దు. 
- డాక్టర్‌ ప్రసూన్‌దేబ్‌, ఎండోక్రైనాలజిస్ట్‌, కిమ్స్‌.
 
ఈ లక్షణాలు కనిపిస్తే అనుమానించాలి
అలసట, విపరీతంగా దాహం వేయడం, ఆకలి ఎక్కువగా ఉంటే అప్రమత్తం కావాలి. తరచూ మూత్రం రావడం, ఏకగ్రత లోపించడం, అతిగా నీళ్లు తాగడం, దెబ్బలు తగిలిన చోట గాయం మానకపోవడం, చిరాకు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రందించాలి. పిల్లల్లో అయితే నిద్రలో మూత్ర విసర్జన, బరువు కోల్పోవడం, నీరసంగా మారడం, వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 40 ఏళ్ల వయస్సు దాటిన వారు ఒత్తిడికి గురికావొద్దు. నిత్యం వ్యాయామం చేయాలి.
- డాక్టర్‌ పి.సుధాకర్‌రెడ్డి, సీనియర్‌ ఎండోక్రైనాలజిస్ట్‌, సన్‌షైన్‌ హాస్పిటల్స్‌.
 
ఎటువంటి ఆహారం మేలు...
సనత్‌నగర్‌ : మధుమేహ వ్యాధితో బాధపడేవారు ఇడ్లీ, దోసె, ఉప్మా, సలాడ్లు, వెజ్‌, చికెన్‌ శాండ్‌విచ్‌, పలుచని శాండ్‌ విచ్‌, పండ్లు, చిరుధాన్యాల రొట్టెలు, చపాతీ, వెన్న తీసిన పాలు, గోధుమలు, ఓట్స్‌, సజ్జలు, రాగులు, కోడిగుడ్డు, పచ్చి కూరగాయలు, మొలకలు, వేయించిన శనగలు, చేపలు, కోడిమాంసం, బాదం, పిస్తా వంటివి తీసుకోవచ్చు. 
 
ఇవి వద్దు
వంట నూనెలు, వెన్న ఉండే సలాడ్లు, వడ, పూరీ, బొండా, మామిడి, ద్రాక్ష, సపోటా, కర్బూజ, సీతాఫలాలు, పరోట, ఫ్రైడ్‌రైస్‌, నూడుల్స్‌, వైట్‌ బ్రెడ్‌, గేదెపాలు, మైదా, సేమియా, వేయించిన గుడ్డు, ఆమ్లెట్‌, వేపుళ్లు, చిప్స్‌, సమోసాలు, బజ్జీలు, చేపల వేపుడు, చికెన్‌, మటన్‌ ప్రై, వేరుశెనగ, కర్జూజ, జీడిపప్పు, పిజ్జాలు, బర్గర్లు. 
 
షుగర్‌ వ్యాధి రాకుండా...
25 సంవత్సరాలు దాటితే ప్రతి ఆరు నెలలకు ఒకసారి రక్తపరీక్షలు చేయించుకోవాలి. సరైన ఆహారపు అలవాట్లతో పాటు యోగా, వాకింగ్‌, జాగింగ్‌, వంటివి రోజూ కనీసం గంటపాటు చేయాలి. ఫ్రైడ్‌రైస్‌, నూనె పదార్థాలు తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. వేపుళ్లకు పూర్తిగా దూరం ఉండాలి. సరైన సమయంలో ఆహారపు నియమాలు పాటిస్తూ నిద్రపోవాలి. ఎటువంటి అనుమానాలున్నా వైద్యుల సూచనల మేరకు నడుచుకోవాలి. 
 -  డాక్టర్‌ అజిత్‌ ఆజాద్‌, ఎండీ, డీఎండీ, ఇంటర్నల్‌ మెడిసిన్‌.