మధుమేహం.. ఎన్నో ప్రశ్నలు

మాదాపూర్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : మధుమేహానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు.. కన్సల్టెంట్‌ ఎండోక్రైనాలజిస్ట్‌ డాక్టర్‌ సునీల్‌ ఏపూరి సమాధానాలు...

ప్రశ్న : మధుమేహం మిఠాయిలు ఎక్కువగా తినటం వలన వస్తుందా? 
సమాధానం : స్వీట్లు తినడం వల్ల మాత్రమే ఈ వ్యాధి రాదు. ఇన్సులిన్‌ నిరోధకత లేదా సంపూర్ణ ఇన్సులిన్‌ లోపం వల్ల వస్తుంది. ఇన్సులిన్‌ నిరోధకత కు ప్రధాన కారణం ఊబకాయం. 
 
ప్రశ్న :డయాబెటిస్‌ పెద్దవయస్సు వారికే వస్తుందా? 
సమాధానం : ఏ వయస్సు వారికైనా వస్తుంది. అధిక బరువు ఉండటం వల్ల టైప్‌-2 డయాబెటీస్‌ పెద్దల్లో కనిపిస్తుంది. ఊబకాయం వల్ల పిల్లల్లో, కౌమారదశలో ఉన్నవారిలో కూడా కనిపిస్తుంది. 
 
ప్రశ్న: వంశపారంపర్యంగా వస్తుందా..? 
సమాధానం : వ్యాధి చరిత్ర కలిగిన కుటుంబాల్లో టైప్‌-2 డయాబెటిస్‌ మెల్లిటన్‌ ఎక్కువగా కనిపిస్తుంది. మధుమేహ సంబంధిత కుటుంబ చరిత్ర లేని వారిలో జీవనశైలి కారణంగా వచ్చే అవకాశం ఉంటుంది. 
 
ప్రశ్న: మధుమేహ వ్యాధి లక్షణాలు ఏంటి?
సమాధానం: మొదట బలహీనమైన పాస్టింగ్‌ గ్లూకోజ్‌తో మొదలవుతుంది. తర్వాత బలహీనమైన గ్లూకోజ్‌ - డయాబెటి్‌సగా మారుతుంది. సంకేతాలు, లక్షణాలు కలిగి ఉండాల్సిన అవసరం లేదు. ఆరోగ్య తనిఖీలు, ఏదైనా శస్త్రచికిత్సల కోసం చేసే పరీక్షల సమయాల్లో ఇది నిర్దారణ అవుతుంది.
 
ప్రశ్న: వ్యాధి గుర్తింపునకు ఎలాంటి పరీక్షలు సరిపోతాయి? 
సమాధానం : డయాబెటిస్‌ నిర్దారణకు ఆర్‌బీఎస్‌, ఎఫ్‌బీఎస్‌, టీపీబీఎస్‌ పరీక్షలు నిర్వహిస్తారు. గ్లూకోజ్‌ టాలరెన్స్‌ టెస్ట్‌తో కచ్చితంగా నిర్దారణ అవుతుంది. ఎఫ్‌బీఎస్‌ - 120, రెండు గంటల పోస్టు గ్లూకోజ్‌ షుగర్‌ 200 కన్నా ఎక్కువగా ఉంటే డయాబెటిస్‌ ఉన్నట్లే. 
 
ప్రశ్న : అందరికీ ఒకేరకంగా చికిత్స ఉంటుందా? 
సమాధానం: శరీరంలో ఇన్సులెన్స్‌ ప్రతిఘటన కారణంగా చక్కెరను జీవక్రియ చేయలేకపోతే టైప్‌-2 డయాబెటిస్‌ చోటు చేసుకుంటుంది. దీనికి జీవనశైలిలో మార్పు, నోటి మందుల ద్వారా చికిత్స లభిస్తుంది. తర్వాత దశలో ఇన్సులిన్‌ అవసరం కావచ్చు. టైప్‌-1 డయాబెటిస్‌ సంపూర్ణ ఇన్సులిన్‌ లోపం వల్ల వస్తుంది. వీరికి ఇన్సులిన్‌తో మాత్రమే చికిత్స సాధ్యమౌతుంది. 
 
ప్రశ్న: జీవనశైలి మార్పు సరిపోతుందా? వైద్యం అవసరమౌతుందా? 
సమాధానం: టైప్‌-1, టైప్‌-2 డయాబెటిస్‌ రెండింటికీ జీవనశైలిలో మార్పులు ముఖ్యమైనవి. టైప్‌-1కు జీవనశైలితో పాటు మందులు అవసరమౌతాయి. టైప్‌-2కు సంబంధించి జీవనశైలి మార్పు ఎంతో ఉపయోగకరం. షుగర్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉంటే మందుల అవసరం ఉంటుంది. 
 
ప్రశ్న : ఒక్కసారి ఇన్సులిన్‌ ప్రారంభిస్తే జీవితాంతం కొనసాగించాలా? 
సమాధానం : టైప్‌-1 డయాబెటిస్‌కు ఇన్సులిన్‌ తీసుకోవడం మాత్రమే సరైన చికిత్స. టైప్‌-2 రోగి అనారోగ్యానికి గురైనప్పుడు సర్జరీ, ఇన్ఫెక్షన్‌ లాంటి పరిస్థితుల్లో మాత్రమే ఇన్సులిన్‌ వాడతారు. తర్వాత రోగి తిరిగి మాత్ర విధానాలకు మారొచ్చు.
 
ప్రశ్న: డయాబెటిస్‌కు నివారణ ఉందా? 
సమాధానం: నివారణ లేదు. నియంత్రణలో మాత్రమే ఉంచుకోగలం.