డెంగీకి ఆరుగురు బలి

ఆంధ్రజ్యోతి, 21-09-2019: డెంగీ జ్వరాలు దడ పుట్టిస్తున్నాయి. దాని బారినపడి శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు మృతిచెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని ధన్‌బాద్‌లో బైపెల్లి ప్రవళిక (15) డెంగీతో మృతిచెందింది. లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్‌కు చెందిన ఇంటర్‌ విద్యార్థిని జంగా తేజస్విని(16), ఖమ్మం జిల్లా చింతకాని మండల పరిధిలోని నాగులవంచ రైల్వే కాలనీవాసి మోదుగు శ్రీనివాసరావు (42) జ్వరంతో చికిత్సపొందుతూ మృతిచెందారు. మల్కాజిగిరి సర్కిల్‌ పరిధిలోని గౌతంనగర్‌ డివిజన్‌ మల్లికార్జున్‌నగర్‌ కాలనీకి చెందిన ప్రవీణ్‌కుమార్‌, మీనాక్షి దంపతుల కుమార్తె బేతాల గ్రీష్మ (7) అస్వస్థతకు గురైంది. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా డెంగీతో రక్తంలో ప్లేట్‌లెట్స్‌ పడిపోవడంతో చిన్నారి మంగళవారం రాత్రి మృతిచెందింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలకేంద్రానికి చెందిన యం.వీరాచారి(36), నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని చీమలగడ్డ కాలనీకి చెందిన కొత్తోజు గాయత్రి(12) డెంగీతో చికిత్సపొందుతూ కన్నమూశారు.

ఎమ్మెల్సీ ఫారూఖ్‌కు డెంగీ
సిద్దిపేటకు చెందిన ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌ డెంగీబారిన పడ్డారు. ఇటీవల ఆయన పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురికాగా వైద్యులు డెంగీగా నిర్ధారించారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.