11 రోజుల వైద్యానికి రూ.16.75 లక్షలు..

మంత్రి చొరవతో రూ.2.75 లక్షలు తగ్గింపు
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
ఖర్చుపై మంత్రి తలసానిని కలిసిన మృతుడి స్నేహితులు
ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడగా రూ. 2.75 లక్షలు తగ్గింపు

అమీర్‌పేట, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): పదకొండు రోజుల వైద్యానికి రూ. 16.75 లక్షలు ఖర్చయింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి సోమవారం సాయంత్రం మృతి చెందాడు. ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లా, పార్లాతిమేడి గ్రామానికి చెందిన జగన్మోహన్‌(28) కుటుంబం 30 సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి జగద్గిరిగుట్టలో నివసిస్తుంది. ఉన్నత విద్య పూర్తి చేసిన జగన్మోహన్‌ హైటెక్‌సిటీలో రిలయన్స్‌ కమ్యూనికేషన్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 1వ తేదీన విధులు ముగించుకొని మిత్రుడు జాన్‌తో కలిసి ద్విచక్రవాహనంపై అర్ధరాత్రి సమయంలో ఇంటికి బయలుదేరాడు. జాన్‌ వాహనం నడుపుతుండగా జగన్మోహన్‌ వెనుక కూర్చున్నాడు.
 
అమీర్‌పేట శివబాగ్‌ కాలనీ సోనాబాయి ఆలయం సమీపంలోకి వెళ్లగానే వర్షంతో వాహనం అదుపు తప్పింది. ఇద్దరూ చెరొకవైపు పడిపోయాడు. జగన్మోహన్‌ డివైడర్‌ కోసం వేసిన రాళ్లపై పడడంతో తలకు తీవ్రమైన గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని 108లో సోమాజిగూడలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమించడంతో సోమవారం సాయంత్రం మృతి చెందాడు.
 
11 రోజుల వైద్యం చేసినందుకు ఆస్పత్రి వారు రూ. 16.75 లక్షల బిల్లు వేశారు. కుటుంబ సభ్యులు రూ. 8 లక్షలు, హెచ్‌ఆర్‌డీసీఎల్‌ గుత్తేదారు రూ. 6లక్షలు చెల్లించారు. ప్రమాదం జరిగిన రోజున అతడి మిత్రులు ఇలాంటి నిర్లక్ష్యాలు జరగకుండా గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని ట్విటర్‌లో కేటీఆర్‌కు పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. సోమవారం స్థానిక కార్పొరేటర్‌ శేషుకుమారితో కలిసి మంత్రి తలసానిని ఆయన నివాసంలో కలిసి ఆస్పత్రి ఖర్చుల గురించి వివరించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడగా రూ. 2.75 లక్షలు తగ్గించారు. సోమవారం కూడా మరోమారు మృతుడి స్నేహితులు గుత్తేదారుల నిర్లక్ష్యంపై కేటీఆర్‌కు ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఆస్పత్రి బిల్లు మొత్తం చెల్లించిన తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించగా అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామం తీసుకెళ్లారు.