వృద్ధురాలికి అరుదైన గుండె చికిత్స

ఏపీలో తొలిసారిగా ట్రాన్స్‌ కేథటర్‌ అయోర్టిక్‌ వాల్‌ ఇంప్లాంటేషన్‌
నెల్లూరు అపోలో వైద్యుల ఘనత

నెల్లూరు, ఆగస్టు 24: గుండె వ్యాధులకు సంబంధించి రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా నెల్లూరు అపోలో సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. దేశంలోని కొన్ని ఆసుపత్రులకే పరిమితమైన ట్రాన్స్‌ కేథటర్‌ అయోర్టిక్‌ వాల్‌ ఇంప్లాంటేషన్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ గుండె వైద్య నిపుణులు భక్తవత్సలరెడ్డి, శ్రీరామ్‌సతీష్‌ మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన మగ్బుల్‌ జాన్‌ (70) అయోర్టిక్‌ వాల్‌ సమస్యతో బాధపడుతున్నారు. అపోలోకి వచ్చిన ఆమెను పరీక్షించగా, అయోర్టిక్‌ వాల్‌ 0.6 మిల్లీమీటర్లు కుంచించుకుపోయినట్లు వైద్యులు గుర్తించారు. అత్యాధునిక ట్రాన్స్‌ కేథలిక్‌ అయోర్టిక్‌ వాల్‌ శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. చెన్నై అపోలో ఆసుపత్రి వైద్యులు సింగొట్టి వెల్‌, ముత్తు కుమరన్‌, గణపతి వైద్య బృందం సహకారంతో ఈ శస్త్రచికిత్స చేశారు. ఛాతీని కోయకుండా ఫెమొరల్‌ ఆర్టెరీ ద్వారా ట్రాన్స్‌ కేథటర్‌ అయోర్టిక్‌ వాల్వును గుండెకు విజయవంతంగా అమర్చారు. ఈ తరహా శస్త్రచికిత్స రాష్ట్రంలో ఇదే తొలిసారని చెప్పారు.