ఇంటిపట్టునే ప్రొస్టేట్‌ కేన్సర్‌ పరీక్ష!

లండన్‌, నవంబరు 29 : శుక్రాశయ పిండ(ప్రొస్టేట్‌) కేన్సర్‌ నిర్ధారణ పరీక్షను అతి తక్కువ ఖర్చుతో ఇంటిపట్టునే నిర్వహించే ప్రత్యేక కిట్‌ను బ్రిటన్‌లోని ఈస్ట్‌ ఆంగ్లియా వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. దీనికి ‘ప్రొస్టేట్‌ యూరిన్‌ రిస్క్‌’(పీయూఆర్‌) అని పేరుపెట్టారు. ఇది అందుబాటులోకి వస్తే రోగులు క్లినిక్‌ల చుట్టూ తిరిగి రకరకాల పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. జేబు గుల్లయ్యే ముప్పు కూడా తప్పుతుంది. మూత్రం శాంపిల్‌లోని జన్యువుల సంశ్లేషణ సమాచారం ఆధారంగా సదరు రోగికి ప్రొస్టేట్‌ కేన్సర్‌ ముప్పు ఏ స్థాయిలో ఉందనేది నిర్ధారిస్తారు. ప్రస్తుతం ఈ వ్యాధి నిర్ధారణకు ‘డిజిటల్‌ రెక్టాల్‌ ఎగ్జామినేషన్‌’ను వాడుతున్నారు. దాని స్థాయిలోనే పీయూఆర్‌ కూడా ప్రొస్టేట్‌ కేన్సర్‌ను గుర్తించగలదని శాస్త్రవేత్తలు తెలిపారు.