ప్యాకెట్లలో ఆహారం సురక్షితమేనా?

ప్రపంచంలో అత్యల్ప నాణ్యత భారత్‌లోనే
జార్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ సర్వే

న్యూఢిల్లీ, ఆగస్టు 21: మీ పిల్లలకు ప్యాకెట్లలో రెడీమేడ్‌గా దొరికే ఆహారం పెడుతున్నారా? సమయాభావం వల్ల ఒక్కోసారి మీ ఇంటిల్లిపాదీ దాన్నే తింటున్నారా? అయితే, మీ కుటుంబ ఆరోగ్యాన్ని మీరే పాడు చేసుకుంటున్నారని అంటున్నారు అంతర్జాతీయ పరిశోధకులు. ప్రపంచ దేశాలన్నింటిలోకెల్లా భారత్‌లోని ప్యాకెట్లలో ఆహారమే అత్యల్ప నాణ్యత కలిగినదని వారు తేల్చారు. ఆ ఆహారం తీసుకుంటే అనారోగ్యాల బారిన పడటం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ప్యాకెట్లలోని ఆహారం ఆరోగ్యవంతమైనదేనా? అని తెలుసుకొనేందుకు జార్జ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ గ్లోబల్‌ హెల్త్‌ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సర్వే చేసింది. దీని కోసం 12 దేశాల నుంచి 4 లక్షల ఆహార పదార్థాలు, పానియాల ప్యాకెట్లను సేకరించి, పరీక్షించారు. అనంతరం ఆహార పదార్థాల్లోని పోషకాల ఆధారంగా ఆయా దేశాలకు రేటింగ్‌ ఇచ్చారు. ఐదు రేటింగ్‌ పాయింట్లకుగానూ 2.82 రేటింగ్‌తో ఈ జాబితాలో బ్రిటన్‌ తొలిస్థానంలో నిలవగా.. 2.27తో భారత్‌ ఆఖరి స్థానంలో నిలిచింది. అమెరికా, ఆస్ట్రేలియా వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి. మరోవైపు భారత్‌ కంటే ముందు స్థానాల్లో చైనా, చిలీ ఉండటం విశేషం. టైప్‌-2 డయాబెటిస్‌, గుండె జబ్బులకు కారణమయ్యే కొవ్వులు, చక్కెర వంటివి భారత్‌లో లభించే ప్యాకెట్లలోని ఆహారంలో ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు తమ పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్త ఎలిజబెత్‌ డన్‌ఫోర్డ్‌ తెలిపారు. 100 గ్రాముల ఆహారంలో 7.3 గ్రాముల చక్కెర ఉండగా.. పోషకాలు మాత్రం అత్యంత తక్కువగా ఉన్నాయని చెప్పారు.