ప్యాకేజ్డ్‌ ఫుడ్‌తో ఊబకాయం
  • ప్రమాణాల్లో అట్టడుగున భారత్‌ మెరుగైన ప్యాకేజ్డ్‌ ఫుడ్‌లో
  • మొదటి స్థానంలో ఇంగ్లండ్‌
  • మన ప్యాకేజ్డ్‌ ఫుడ్‌లో కొవ్వెక్కువ
  • చక్కెర, ఉప్పు, శక్తి.. అన్నీ అధికమే
  • పేద దేశాల్లో పరిస్థితి చాలా నయం
  • నాణ్యమైన ప్యాకేజ్డ్‌ ఫుడ్‌లో ఇంగ్లండ్‌ టాప్‌
  • ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా, ఆస్ట్రేలియా
  • ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబరు 7:క్షణం తీరిక లేకుండా.. కాలంతోపాటు పరుగులు తీస్తూ యాంత్రిక జీవనం గడుపుతున్న రోజులివి. దాంతో మనవాళ్లు ఆకలేస్తే ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌, రెడీమేడ్‌ ఫుడ్‌ లాగించేస్తున్నారు. ఇంకా బద్ధకం అనిపిస్తే.. పాకేజ్డ్‌ చిప్స్‌, ఇతర చిరుతిళ్ల వైపు మొగ్గుచూపుతున్నారు. డాక్టర్లు పండ్లరసాలు తాగాలని సలహాలిస్తే.. వాటి స్థానాన్నీ ప్యాకేజ్డ్‌ డ్రింక్స్‌తో భర్తీ చేసేసి ‘‘మమ’’ అనేస్తున్నారు. అయితే.. భారత్‌లో లభ్యమవుతున్న ప్యాకేజ్డ్‌ ఫుడ్‌, డ్రింక్స్‌లో ఆరోగ్యానికి హాని కలిగించే స్థాయిలో చక్కెర, ఉప్పు, కొవ్వు ఉన్నాయని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ జరిపిన పరిశోధనలో తేలింది. ‘ఒబేసిటీ రివ్యూస్‌’ జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. 2013-18 మధ్యకాలంలో పలు దేశాల్లోని ప్యాకేజ్డ్‌ ఫుడ్‌పై జరిపిన అధ్యయనంలో.. నాణ్యతను పాటించే దేశాల కేటగిరీలో ఇంగ్లండ్‌, అమెరికా, ఆస్ట్రేలియా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
 
ఆ జాబితాలో భారత్‌ కింది నుంచి మొదటి స్థానంలో ఉండగా.. చైనా, చిలీ ఆ తర్వాతి స్థానాలను ఆక్రమించాయి. ఆస్ట్రేలియా హెల్త్‌ స్టార్‌ రేటింగ్‌ సిస్టం (హెచ్‌ఎ్‌సఆర్‌) మేరకు జరిపిన ఈ అధ్యయనంలో.. భారత్‌లోని ప్యాకేజ్డ్‌ ఫుడ్‌లో ప్రతి వంద గ్రాములకు 1,515 కిలో జౌల్స్‌ మేర శక్తి, 7.3 గ్రాముల పంచదార, అధిక మొత్తంలో ఉప్పు, కొవ్వు ఉన్నట్లు తేలింది. తరచూ వీటిని తినేవారు ఊబకాయం బారిన ప్రమాదముందని వెల్లడైంది. ఊబకాయం సంబంధిత వ్యాధులకు భారత ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ దగ్గరి దారి అని తేలింది. చైనా ర్యాంకింగ్‌ భారత్‌కంటే కొంత మెరుగ్గానే ఉన్నా.. ఆ దేశానికి చెందిన ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ చాలా ప్రమాదకరమని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అధ్యయనం స్పష్టం చేసింది. కాగా.. పేద దేశాల్లో లభ్యమవుతున్న ప్యాకేజ్డ్‌ ఫుడ్‌, డ్రింక్స్‌లో నాణ్యత చాలా బాగుందని.. కొవ్వు, చక్కెర, ఉప్పు స్థాయులు తక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనం గుర్తించడం గమనార్హం.