ఆస్పత్రుల్లో భద్రత ఏదీ?

బహుళ అంతస్తుల భవనాల్లో కనీస ప్రమాణాలు పాటించరా?
అధికారులు ఏం చేస్తున్నారు?
అనుకోని ప్రమాదం జరిగితే పోయిన ప్రాణాలు తేగలరా?
నిబంధనలు అమలు కావాలి
తనిఖీలు చేసి నివేదిక ఇవ్వండి
అధికారులకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): కనీస ప్రమాణాలు పాటించకుండా ప్రైవేటు ఆస్పత్రులను నిర్వహిస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంజూరైన ప్లాన్‌కు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తుంటే అడ్డుకోవాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర వహించడంపై విస్మయం వ్యక్తం చేసింది. సెట్‌బ్యాక్‌ లేకుండా బహుళ అంతస్తుల భవనం నిర్మించి అందులో ఆస్పత్రిని ఏళ్ల తరబడి నిర్వహిస్తున్నా మీనమేషాలు లెక్కించడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించింది. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, ఫైర్‌ సేఫ్టీ అనుమతులు లేకుండానే కరీంనగర్‌లో వెంకటేశ్వర కిడ్నీ సెంటర్‌ పేరిట ఆస్పత్రి నిర్వహిస్తుంటే అధికారులు కేవలం నోటీసులు జారీ చేసి మిన్నకుంటే ఎలా అని నిలదీసింది. ప్రమాణం చేసి వైద్య వృత్తిని చేపట్టిన డాక్టర్లే ఇలా వ్యవహరిస్తే సాధారణ రోగులు, ప్రజల పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేసింది.

ఆస్పత్రిలో భద్రతాలోపాలు ఉన్నట్లు గుర్తించిన అధికారులు యాజమాన్యంపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీసింది. ఆస్పత్రిలో అన్ని నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో విపత్తు నిర్వహణ శాఖ, అగ్నిమాపక శాఖ, వైద్య శాఖ, మునిసిపల్‌ అధికారులు కోర్టు ధిక్కారం కింద కోర్టు ముందు హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కరీనంగర్‌ పట్టణంలో నిబంధనలు ఉల్లంఘించి బహుళ అంతస్థుల భవనం నిర్మించి అందులో ఒక ప్రైవేటు ఆస్పత్రి నిర్వహిస్తున్నారని, అనుకోని ప్రమాదాలు జరిగితే రోగులు, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ సీహెచ్‌.లక్ష్మీనర్సింహారావు, మరొకరు హైకోర్టును ఆశ్రయించారు. చట్ట ప్రకారం ఫైర్‌ సేఫ్టీ, సెట్‌బ్యాక్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశిస్తూ వ్యాజ్యాన్ని హైకోర్టు ముగించింది. ఈ నేపథ్యంలో అధికారులు హాస్పిటల్‌ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చి మిన్నకుండిపోయారు. దీంతో పిటిషనర్లు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించి అప్పీలు దాఖలు చేశారు. దీనిని విచారించిన ధర్మాసనం.. అధికారులు, ఆస్పత్రి యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
 
భద్రతా ఏర్పాట్లు లేకుండా ఏళ్ల తరబడి ఆస్పత్రి నిర్వహిస్తుంటే అధికారులు మౌనంగా ఎందుకు ఉన్నారని నిలదీసింది. ఢిల్లీ, కోల్‌కతా తరహాలో భారీ అగ్ని ప్రమాదాలు జరిగితే పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. ఆసుపత్రిని తనిఖీ చేసి నిబంధలనప్రకారం అన్ని వసతులు ఉన్నాయో లేవో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. చట్ట ప్రకారం అన్ని నిబంధనలు అమలు చేస్తామని, కొంత గడువు ఇవ్వాలని ఆస్పత్రి యాజమాన్యం తరఫు న్యాయవాది అభ్యర్థించగా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2012 నుంచి ఆసుపత్రి నిర్వహిస్తున్నారు... ఇంతకాలం ఎందుకు పట్టించుకోలేదని నిలదీసింది. ఒక వైద్యునిగా ప్రమాణం చేసి వైద్య వృత్తిని చేపట్టిన డాక్టర్లే ఇలా వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు రిజిస్ర్టేషన్‌ను రద్దు చేయమని ఎంసీఐకి సిఫారసు చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇంత కాలం నిబంధనలు పాటించకుండా ఆస్పత్రి నిర్వహిస్తున్నందుకు మీ క్లయింట్‌పై భారీ జరిమానా విధించనందుకు సంతోషించాలని వ్యాఖ్యానించింది.