కేసీఆర్‌ కిట్‌కు కాసుల కటకట.. రూ.165 కోట్ల బకాయిలు

నెలల తరబడి జమ కాని సొమ్ములు

ఎదురు చూస్తోన్న గర్భిణులు

హైదరాబాద్‌, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో సహజ ప్రసవాలు పెంచే లక్ష్యంతో సర్కారు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కేసీఆర్‌ కిట్‌ పథకానికి సొమ్ములు కరువయ్యాయి. గత కొన్ని నెలలుగా ఈ పథకం కింద గర్భిణులకు బ్యాంకుల్లో జమ చేయాల్సిన సొమ్ములు వేయడం లేదు. విశ్వసనీయ సమాచారం మేరకు అక్టోబరు 31 వరకు రూ.165 కోట్ల బకాయిలున్నట్లు తెలుస్తోంది. దాదాపు 3 లక్షల కిస్తీలు పెండింగ్‌లో ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. 2017 జూన్‌ 2న ప్రవేశపెట్టిన ఈ పథకం కింద 4 విడతల్లో రూ.12 వేలు ఇస్తున్నారు. ఆడపిల్ల పుడితే అదనంగా మరో వెయ్యి ఇస్తున్నారు. వీటితోపాటు కాన్పు సమయంలో రూ.2 వేలు విలువైన 16 రకాల వస్తువులుండే కిట్‌ను అందిస్తున్నారు. ప్రారంభమైన తొలినాళ్లలో బాగానే నగదు జమ చేశారు. క్రమంగా ఈ పథకానికి నిధుల కొరత ఏర్పడింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 3.98 లక్షల మంది గర్భిణులు రిజిష్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిలో సర్కారీ దవాఖానల్లో ప్రసవాలైన వారికి 1.34 లక్షల కేసీఆర్‌ కిట్లు పంపిణీ చేశారు. రిజిస్ట్రేషన్‌చేసుకున్న వారిలో తొలి విడత కిస్తీ రూ.3 వేలు అందని గర్భిణులు కూడా ఉన్నారు. మరికొందరికి ఒక్క విడత సొమ్ములే అందాయి. మిగిలిన కిస్తీల కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
 
నోరు మెదపని అధికారులు
బకాయిల గురించి కేసీఆర్‌ కిట్‌ సీఈవోను వివరణ కోరేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నించగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము సమాచారం ఇవ్వగలుగుతామని, వారి అనుమతి లేకుండా ఏమీ మాట్లాడలేమని చెప్పారు.