యాభైఏళ్ల వయసు దాటిన వారిలో 12 శాతం మందికి మధుమేహం

సర్వేలో తేలిన నిజం

న్యూఢిల్లీ : దేశంలో సైలెంట్ కిల్లర్‌గా పేరొందిన మధుమేహ వ్యాధితో బాధపడుతున్న రోగుల సంఖ్య నానాటికి పెరుగుతోందని జాతీయ డయాబెటిస్, డయాబెటిక్ రెటినోపతి సర్వే నివేదిక 2015-19లో వెల్లడైంది. యాభై ఏళ్లు దాటిన స్త్రీలలో 11.7 శాతం మంది, పురుషుల్లో 12 శాతం మంది మధుమేహం బారిన పడ్డారని తాజా సర్వేలో తేలింది. 70-79 సంవత్సరాల మధ్య వయసులో వారిలో మధుమేహ వ్యాధిగ్రస్థుల సంఖ్య 13.2 శాతానికి పెరిగిందని తాజా సర్వే నివేదిక వెల్లడించింది. 2015-19 మధ్యకాలంలో రాజేంద్రప్రసాద్ సెంటర్ ఫర్ ఆప్తాల్మిక్ సైన్సెస్, ఆల్ ఇండియా ఇన్‌స్టి‌ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జరిపిన సర్వే నివేదికను ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసింది. దేశంలోని 21 జిల్లాల్లో 50 ఏళ్ల కంటే అధిక వయస్సు గల 63,000 మందిని సర్వే చేయగా ఎక్కువ మందికి మధుమేహ వ్యాధి సోకిందని వెల్లడైంది.
 
50 సంవత్సరాల వయసు గల మధుమేహ వ్యాధిగ్రస్థుల్లో 16.9 శాతం మందికి డయాబెటిక్ రెటినోపతి బారిన పడ్డారని సర్వేలో తేలింది. ప్రపంచఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం భారతదేశంలోని వయోజనుల్లో 72.96 మిలియన్ల మంది డయాబెటీస్ బారినపడ్డారు. 50 ఏళ్లు పైబడిన వారిలో మధుమేహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 1.06శాతం మంది అంధత్వానికి, 1.16 శాతం మంది దృష్టి లోపాలకు డయాబెటిక్ రెటినోపతి కారణమని అంచనా వేశారు. ‘‘దురదృష్టవశాత్తు మధుమేహవ్యాధిగ్రస్థులు కంటి వ్యాధికి తక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. డయాబెటిస్ ఉన్న ప్రతి రోగి సంవత్సరానికి ఒకసారి కంటి రెటీనాను తనిఖీ చేయించుకోవాలి. ప్రారంభంలో రెటీనా నష్టాన్ని గుర్తిస్తే నివారించవచ్చు.’’అని ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్, ఫోర్టిస్ సి-డాక్ చైర్మన్ డాక్టర్ అనూప్ మిశ్రా చెప్పారు.