ఏపీకి కొత్తగా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ!

ఆంధ్రజ్యోతి, 20-09-2019: ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ మంజూరు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతి సుడాన్‌ ఏపీ అధికారులకు సంకేతాలిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లోనే ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు లేవు. కనీసం ఈ రెండు జిల్లాలకు రెండు ప్రభుత్వ కాలేజీలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, తొలిదశలో ఒకటివ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరిస్తున్నట్లు గురువారం ఢిల్లీలో జరిగిన వైద్య, ఆరోగ్యశాఖ సమీక్షా సమావేశంలో సుడాన్‌ సంకేతాలిచ్చారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
 
ఏపీ తరఫున రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి డా.కేఎస్‌ జవహర్‌రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర నిధులతో ఏపీలో చేపట్టే వివిధ పథకాల పురోగతి, ప్రజారోగ్యం కోసం ఏపీ ప్రభుత్వ నిధులతో చేపడుతున్న వివిధ పథకాల అమలుతీరును వివరిస్తూ నివేదిక సమర్పించారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమం కింద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప వైద్య కేంద్రాలను మరింత పటిష్ఠం చేయడానికి, ప్రజలకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని ప్రీతి సుడాన్‌ వెల్లడించారు. ఈ వైద్య కేంద్రాలలో మౌలిక సౌకర్యాల కల్పనతోపాటు అవసరమైన సాంకేతిక పరికరాలు, ప్రయోగశాలలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం నుంచి 60ః40 నిష్పత్తిలో నిధులు సమకూర్చుతామని చెప్పారు.