కార్బన్‌ డయాక్సైడ్‌ను దిగ్బంధించే సరికొత్త సాధనం

 టోక్యో, అక్టోబరు 13: కాలుష్య మహమ్మారి కార్బన్‌ డయాక్సైడ్‌(సీఓ2)ను సేంద్రియ రూపంలోకి మార్చగల సరికొత్త సాధనం ఆవిష్కృతమైంది. జపాన్‌లోని క్యోటో, టోక్యో వర్సిటీలు, చైనాలోని జియాంగ్సు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల సంయుక్త బృందం దీన్ని కనుగొంది. పోరస్‌ కోఆర్డినేషన్‌ పాలిమర్‌(పీసీపీ) అనే సాధనాన్ని జింక్‌ లోహ అయాన్లతో రూపొందించారు. ఇది కార్బన్‌ అణువుల కదలికలు సాఫీగా సాగేందుకు అత్యంత అనువైన సూక్ష్మరంధ్రాలతో నిండి ఉంటుంది. వీటి ద్వారా లోపలికి ప్రవేశించే సీఓ2ను దిగ్బంధించి, దాని అణువుల్లో మార్పులు చేస్తుంది పీసీపీ. ఇలా కార్బన్‌ అణువులతో నిండిపోయిన పీసీపీని పాలీయురేథేన్‌, ప్యాకేజింగ్‌ సేంద్రియ ఉత్పత్తుల తయారీకి వాడొచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పీసీపీ రీసైకిల్‌ చేయదగిందని.. వరుసగా పదిసార్లు వాడినా దానిలోని ఉత్ర్పేరకాల శక్తి ఏ మాత్రం తగ్గదని పేర్కొన్నారు.