నయా ‘ఉప్పు’ద్రవం

ఆంధ్రజ్యోతి(27-10-2016): రెట్టింపు ఉప్పు తింటున్న భారతీయులు ఇది చాలా ప్రమాదకరమంటున్న వైద్య నిపుణులు
ఉప్పు తక్కువైతే రుచి ఉండదు. మరి ఎక్కువైతే మీరుండరు. ఇది కాస్త ఓవర్‌గా అనిపించవచ్చుగాక.. కానీ నిజం. ఆహారంలో ఉప్పు ఎక్కువైతే ఆరోగ్యానికి వచ్చే ముప్పులెన్నో. అయినా సరే.. భారతీయులు ఈ ముప్పును లెక్క చేయడం లేదు. తెలిసో తెలియకో.. పరిమితికి మించి ఉప్పును తినేస్తున్నారు. ఈ మేరకు జార్జి ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ హెల్త్‌ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
 
రోజూ తినాల్సిన ఉప్పు : 5 గ్రాములు 
మనవారు తింటోంది: 10.98 గ్రామలు
అంటే రెట్టింపు లాగిచ్చేస్తున్నారన్నమాట. 
 
‘త్రి’పుర
ఈశాన్య, దక్షిణాది రాష్ర్టాల్లో ఉప్పు వినియోగం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా త్రిపురలో అయితే రోజుకు 14 గ్రాములు తింటున్నారు. ఇది ప్రపంచ బ్యాంకు సూచించిన 5 గ్రాములకంటే దాదాపు మూడింతలు. 
 
ఎందుకిలా!
దేశంలో ఆహారపు అలవాట్లు బాగా మారిపోయాయి. పప్పులు, ధాన్యాలు తినడం తగ్గిపోయి జంక్‌ ఫుడ్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌ తినడం పెరిగింది. దీంతో ఆహారంలో ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలు ఎక్కువైపోయాయి. దీని వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. 
 
తేడా లేదు
అధిక ఉప్పు వినియోగంలో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య తేడా లేదు. రెండు ప్రాంతాల్లోనూ ఉప్పు అధికంగా ఉండే పచ్చళ్లను ఎక్కువగా తింటున్నారు.
 
ఉప్పెనలా..!!
దేశంలో ఏటా 23 లక్షల మంది హృద్రోగాలతో చనిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల 2030కి దేశంలో 21 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతారని అంచనా. తక్షణ పరిష్కారం: ఆహారంలో ఉప్పును సగానికి తగ్గించి పప్పుల వినియోగం సమస్యలకు ఈ పరిష్కారమని అధ్యయనం తేల్చింది. 
 
ప్రధాన సమస్యలు 
అధిక రక్తపోటు
స్థూలకాయం
హృద్రోగాలు
గుండెపోటు
స్ర్టోక్‌