జ్ఞాపకాల ‘చిప్‌’

మెదడు పనిచేసేలా బయోనిక్‌ మెదడు దిశగా ముందడుగు
ఆర్‌ఎంఐటీ పరిశోధకుల ఘనత.. భారతీయుడి నేతృత్వం

సిడ్నీ, జూలై 17: చూసినదాన్ని, విన్నదాన్ని, జరిగినదాన్ని గుర్తుపెట్టుకొని, అవసరమైనప్పుడు ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకోవడం, పాత అనుభవాల ఆధారంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడం. ఇదీ మెదడు చేసే పని. కంప్యూటర్‌ కూడా గుర్తుపెట్టుకోగలదు. కానీ చూసినదాన్ని, విన్నదాన్ని కాదు. మనం ఫీడ్‌ చేసినదాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోగలదు. దాన్నుంచి అడిగిన సమాచారాన్ని ఇవ్వగలదు. కానీ.. మనలాగా విశ్లేషించి కొత్త నిర్ణయాలు తీసుకోలేదు. వాటికి ఆ తెలివితేటలను ఇచ్చే ప్రక్రియే కృత్రిమ మేధ. ఆస్ట్రేలియాకు చెందిన ‘రాయల్‌ మెల్‌బోర్న్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ పరిశోధకులు ఇప్పుడా దిశగా కీలక ముందడుగు వేశారు. అత్యంత సంక్లిష్టమైన మనిషి మెదడు తరహాలో పనిచేసే కృత్రిమమేధకు అవసరమైన, జ్ఞాపకాలను భద్రపరచుకోగల ఎలకా్ట్రనిక్‌ చిప్‌ను తయారుచేశారు. ఇందుకోసం వారు ‘ఆప్టోజెనెటిక్స్‌’ అనే కొత్త పద్ధతి నుంచి స్ఫూర్తి పొందారు.

సజీవ కణాలను.. మరీ ముఖ్యంగా నాడీ కణాలను నియంత్రించేందుకు కాంతిని వినియోగించుకునే పద్ధతిని ఆప్టోజెనెటిక్స్‌ అంటారు. మెదడులో జ్ఞాపకాలు ‘విద్యుత్‌ప్రచోదనం’తో ఏర్పడుతాయి. అదే పద్ధతిని ఉపయోగించి వారు ఈ సరికొత్త చిప్‌ను తయారుచేశారు. ఇందుకోసం అత్యంత పలుచనైన పదార్థాన్ని వినియోగించారు. విద్యుత్తులో తేడాల ఆధారంగా చిప్‌ జ్ఞాపకాలను ఏర్పరచుకోగలదు. మరచిపోగలదు. చుట్టూ ఉండే వాతావరణం నుంచి మెదడు ఎలా నేర్చుకుంటుందో అచ్చం అలాగే నేర్చుకోగలిగే సామర్థ్యం ఉన్న బయోనిక్‌ మెదడు తయారీలో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని శాస్త్రజ్ఞులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిప్‌ను రూపొందించిన బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ సుమీత్‌ వాలియా భారతీయుడు కావడం గమనార్హం.