సీఎం సారూ.. నన్ను బతికించండి!

ఆపన్నహస్తం కోసం ఓ అభాగ్యుడి ఎదురుచూపులు 
మెదక్, కొండపాక: అతడు రోజువారీ కూలీ. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వచ్చిన సంపాదనతో ఎలాగోలా సంసారం నెట్టుకొస్తున్న సమయంలో రెండు కిడ్నీలూ విఫలమయ్యాయి. తన కిడ్నీ ఇచ్చేందుకు కన్నతల్లి ముందుకు వచ్చింది. కానీ.. ఆపరేషన్‌కు అవసరమైన డబ్బు లేకపోవడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. ఇంత ఖర్చు పెట్టుకోవడం తమ కుటుంబానికి సాధ్యం కాదని, ఎలాగైనా తనకు సహాయం చేసి బతికించాలంటూ సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావులను కిషన్‌ వేడుకుంటున్నాడు. మెదక్‌ జిల్లా, కొండపాకకు చెందిన పోతుగంటి కిషన్‌(28) బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లి భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. భార్య లలిత ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తోంది. కిషన్‌ ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రికి వెళ్లగా.. రెండు కిడ్నీలూ విఫలమైనట్లు తేలింది. వెంటనే కిడ్నీ మార్పిడి చేయించుకోకుంటే బతకడం కష్టమని హైదరాబాద్‌ కిడ్నీ సెంటర్‌ వైద్యులు చెప్పారు. ప్రస్తుతం డయాలసిస్‌ చేస్తూ ప్రాణాలు కాపాడుతున్నారు. ఇప్పటికే అప్పుసప్పు చేసి రూ. 3.5 లక్షల వరకూ ఖర్చు పెట్టారు. ఇప్పుడు కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌కు రూ.6 లక్షలకుపైనే ఖర్చవుతుందని చెప్పడంతో ఏంచేయాలో తెలియని స్థితిలో ఉన్నాడు. ప్రభుత్వం ఆపన్నహస్తం అందించి కాపాడాలని ప్రాధేయపడుతున్నాడు.