డెంగీతో చనిపోతే బయటకు చెప్పొద్దా!

వాస్తవాలు చెప్పకుండా ఆస్పత్రులపై ఒత్తిడి సరికాదు
అలా చేస్తే ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోతుంది
కేంద్రం విధానాలు అమలు చేయమని చెప్పండి
ఏజీకి హైకోర్టు ఆదేశం
సర్కారు తీరుపై ఆందోళన

హైదరాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): డెంగీ వ్యాధికి చికిత్స పొందుతూ ఎవరైనా మరణిస్తే ఆ విషయాన్ని బయటకు చెప్పవద్దని ప్రైవేటు ఆసుపత్రులపై అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లు పత్రికల్లో వస్తున్న కథనాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అలా చేస్తే ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం సన్నగిల్లుతుందని వ్యాఖ్యానించింది. వాస్తవాలు చెప్పకుండా ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రించరాదని తెలిపింది. ప్రమాద ఘంటికలు మోగుతున్న పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రులను నిజాలు మాట్లాడనివ్వాలని, దాని వల్ల కచ్చితమైన అంచనా వేయవచ్చని అభిప్రాయపడింది. అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ కల్పించుకుంటూ పత్రికల్లో వచ్చే అన్ని కథనాలు వాస్తవాలు కాదని కోర్టుకు తెలిపారు. పత్రికల్లో వచ్చే కొన్ని కథనాల్లో అర్ధసత్యాలు ఉండవచ్చని, అంతమాత్రాన ప్రజాహిత వ్యాజ్యాలను వ్యతిరేకమైనవిగా పరిగణించరాదని సూచించింది. వీటిపై సానుకూలంగా స్పందించి డెంగీ మహమ్మారిని తరిమికొట్టాలని, ప్రభుత్వం తీసుకున్న చర్యలను తదుపరి విచారణ చేపట్టే ఈ నెల 25 నాటికి తెలపాలని స్పష్టం చేసింది. డెంగీ నివారణకు కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్‌ వెక్టర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ ప్రోగ్రాం’ ప్రవేశపెట్టిందని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో పెట్టాలని అమికస్‌ క్యూరీ ఎస్‌.నిరంజన్‌ రెడ్డి కోరారు. దీని ప్రకారం ఎక్కడైనా డెంగీ సోకినట్లు తేలితే ‘ర్యాపిడ్‌ యాక్షన్‌ టీం’ వెళ్లి చర్యలు తీసుకోవాలని తెలిపారు. కేంద్రం తెచ్చిన పథకాలపై ఒక నివేదికను కోర్టుకు ఇచ్చారు.

దీనిపై కేంద్ర సంస్థల విధానాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించాలని అడ్వకేట్‌ జనరల్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కోవడంతో ప్రభుత్వానికి సహకరించేందుకు ప్రైవేటు వైద్యులు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపారు. ప్రాణాంతకంగా మారిన డెంగీ నివారణకు పలు సూచనలు చేసినా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదంటూ వైద్యురాలు డాక్టర్‌ ఎం.కరుణ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. స్వైన్‌ ఫ్లూ, మలేరియా, డెంగీ జ్వరాల వ్యాప్తిపై ప్రధాన న్యాయమూర్తికి న్యాయవాది ఆర్‌.భాస్కర్‌ రాసిన లేఖను సుమోటో పిల్‌గా హైకోర్టు స్వీకరించింది. ఈ రెండు వ్యాజ్యాలు శుక్రవారం కోర్టు ముందుకు వచ్చాయి. మధ్యాహ్న భోజన విరామ సమయంలోగా ఇవి విచారణకు రాకపోవడంతో సోమవారం విచారణ చేపట్టాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ధర్మాసనం రెండు రోజులుగా పత్రికల్లో డెంగీపై వస్తున్న కథనాలు చూస్తున్నామని, పరిస్థితి చేయిదాటి ప్రమాద ఘంటికలు మోగిస్తోందని వ్యాఖ్యానించింది.