కునుకే బంగారమాయె...

ఆంధ్రజ్యోతి(21-10-2016): నగరం, పల్లె ఆలస్యంగా నిద్దరోతోంది. ఒకప్పుడు ఉద్యోగం అంటే ఉదయం వెళ్లి సాయంత్రానికి ఇంటికి చేరడం అన్నట్లు ఉండేది. నేటి షిప్టుల విధానంలో పగలు, రాత్రి తేడా లేకుండా ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది. అర్దరాత్రి దాకా వీడియో కాలింగ్‌లు, వాట్సప్‌ చాటింగ్‌లు, టీవీల్లో డెయిలీ సీరియల్స్‌, అర్థ రాత్రి మిస్టరీలు.. వీటన్నింటి కారణంగా కాలపట్టిక గతి తప్పుతోంది. దీంతో పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా నిద్రలేమి సమస్య నేటి తరాన్ని పట్టి పీడిస్తుంది.గుంటూరు (నల్లచెరువు) : నేడు అనేక మంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటన్నట్లు వైద్యులు చెబుతున్నారు. నగరం పల్లె అన్న తేడా లేకుండా జిల్లాలో ఇలాంటి వారు వేలల్లో ఉన్నారని నిపుణులు పేర్కొంటున్నారు. అభివృద్ధి చెందుతున్న దశ, జీవన శైలిలో మార్పులు ఇందుకు ప్రధాన కారణమని వారంటున్నారు. వేగంగా వస్తున్న మార్పులు శరీరానికి అత్యంత ముఖ్యంగా కావాల్సిన విశ్రాంతిని దూరం చేస్తున్నాయని చెబుతున్నారు. రోజులో కనీసం ఏడు గంటలు నిద్రపోవాలన్న నిబంధన ఉంది. అయితే ఇందుకు మనకు సమయం చిక్కడం లేదు. కంటి నిండా నిద్ర లేకపోవడం వల్ల మెదడు పనీతీరు తగ్గుతుంది. పని సామర్థ్యం పూర్తిగా దెబ్బతింటుంది. 
గాఢ నిద్రతో ఎంతో మేలు 
రోజులో కనీసం ఏడు గంటలు పడుకోవాలి. అది కూడా ఏకధాటిగా అయితే గాఢ నిద్ర అంటారు. ఇది శరీరానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. ఇలా వీలు కాకుంటే రోజు మొత్తంలో రెండు విడతలుగా అయినా ఏడు గంటలు నిద్ర తప్పనిసరి. నిద్రలేమి దీర్ఘ కాలంలో పెద్ద సమస్యలు తెచ్చి పెడుతుందన్న విషయం మరువకూడదు. పెద్దల నిద్రలేమి చిన్నారులపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. 
ఆరోగ్యానికి ఎంత నిద్ర అవసరం 

వయసును బట్టి నిద్రపోవాల్సిన సమయం ఉంటుంది. చిన్న పిల్లలు అయితే 8 గంటల నుంచి 12 గంటల వరకు నిద్ర అవసరం అవుతుంది. 18 ఏళ్లు నుంచి 64 ఏళ్ల వారికి వరకు రోజుకు ఏడు గంటలు నిద్ర తప్పనిసరి. 

సుమిత్‌ ఓ వ్యాపారి. ఉదయం పది గంటలకు దుకాణానికి వెళితే రాత్రి 11 గంటలకు ఇంటికి చేరేది. స్నానం, భోజనం, ఇలా 12 గంటలకు కానీ పడక మీదకు చేరలేని పరిస్థితి. దీంతో కొద్దికాలంగా పగలు సైతం బద్ధకంగా, నిస్సత్తువుగా ఉండటం, ఆవలింతల, పనిమీద శ్రద్ధ తగ్గడం జరుగుతోంది. సుమిత్‌ భార్యదీ ఇదే పరిస్థితి. భర్త వచ్చే వరకు వేచి చూడటం తెల్లారే లేవడంతో ఆమె నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటుంది. ఇద్దరూ వైద్యుడిని సంప్రదిస్తే సమయానుకూలంగా నిద్రపోవడం తప్ప దీనికి మరో మార్గం లేదని తేల్చి చెప్పారు. నిద్రాదేవి ఆవహించి హాయిగా నిద్రపోవాలంటే కొన్ని అలవాట్లు వదులుకోవాలి. మరికొన్ని కొత్తగా మొదలు పెట్టాలి.

హాయిగా నిద్ర పోవాలంటే...
శరీరానికి తగినంత శారీరక శ్రమ ఉంటేనే నిద్ర హాయిగా పడుతుంది. ఏ వృ త్తి, ఉద్యోగం అయినా వ్యాయామం తప్ప కుండా చేయాలి.
పడక గదుల్లో టీవీలు, ల్యాప్‌ట్యాప్‌, కంప్యూటర్‌ వంటివి లేకుండా చూడాలి. వీలైనంత వరకు సెల్‌కు దూరంగా ఉం డాలి. పడుకున్నాక స్మార్ట్‌ఫోన్‌ను సైలెంట్‌ లో పెట్టడం ఉత్తమం.
కాఫీ మిషన్లు వచ్చాక అనేక మంది అర్థరాత్రి కాఫీలు తాగి ఇం టికి చేరుతున్నారు. పగలు, రాత్రి ఎప్పుడైనా సరే రోజుకు రెండుసార్లుకు మించి కాఫీ, టీల జోలికి వెళ్లకూడదు.
రాత్రి గోరు వెచ్చటి పాలు తాగాలి. పాల నుంచి వచ్చే వేడి ఆవిరి ముఖంపైకి చేరి సుఖ నిద్రకు ఊతమిస్తుంది.
రాత్రి వేళ జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు త్వరగా భోజనం ముగించాలి. అదీ మితంగా ఉండాలి.
వివాహం అయిన వారు పడ క గదిలో అన్యోన్యంగా మాట్లాడుకుం టూ నిద్రకు ఉపక్రమించితే త్వరగా నిద్రలోకి జారుకుంటారు.
 
పొంచి ఉన్న ప్రమాదాలు
చురుకుదనం లోపిస్తుంది.
జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది.
 టైప్‌ 2 మధుమేహ ప్రమాదం పొంచి ఉంటుంది.
అప్రమత్తత లోపిస్తుంది. పరధ్యానంగా ఉంటారు.
చికాకు, ఒంటి నొప్పులు ఆవహిస్తాయి.
గుండె జబ్బుల ముప్పు పెరుగుతుంది.
 కునుకు పాట్లు, బరువు పెరగడం జరుగుతుంది.
రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గిపోతుంది.