విశాఖలో కేజీహెచ్‌ జూనియర్‌ డాక్టర్ల ఆందోళన

విశాఖపట్నం: వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్‌ను కఠినంగా శిక్షించాలని కేజీహెచ్‌లోని జూనియర్‌ డాక్టర్లు శనివారం ఆందోళన చేశారు. గుంటూరు వైద్య కళాశాలలో గైనకాలజీ విభాగంలో పోస్టుగ్రాడ్యుయేషన్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న  సంధ్యారాణి ప్రొఫెసర్‌ డాక్టర్‌ వీఏఏ లక్ష్మివేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ వీరం తా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థుల అధ్యక్షుడు డాక్టర్‌ పిలాల్‌ మాట్లాడుతూ వైద్య విద్యార్థినిని ప్రొఫెసర్‌ లక్ష్మి అందరి ముందు చులకనగా, హేళనగా మాట్లాడుతూ ఆమెను తీవ్ర మానసిక వేదనకు గురి చేశారని ఆరోపించారు. ప్రొఫెసర్‌ లక్ష్మిని తక్షణమే విధులు నుంచి తప్పించి కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఆస్పత్రిలో అత్యవసర సేవలకు ఎలాంటి విఘాతం కలుగకుండా గంటసేపు ఆందోళన నిర్వహిస్తున్నామని, ఆమెపై చర్యలు తీసుకోకుంటే ఆందోళన ఉధృతం చేసి సమ్మె కూడా చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆస్పత్రి నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ ఎ.మదన్‌, డాక్టర్‌ రాఘవేంద్ర, డాక్టర్‌ సుధారాణి, పలువురు పోస్టుగ్రాడ్యుయేట్లు, హౌస్‌ సర్జన్‌ విద్యార్థులు పాల్గొన్నారు.