మగవారికి గర్భనిరోధక ఇంజక్షన్‌!

జెనీవా, అక్టోబరు 28: అవాంఛిత గర్భం నిరోధించేందుకు ఇక కండోమ్స్‌ వాడనవసరం లేదు. సైడ్‌ ఎఫెక్ట్స్‌ కలిగించే గర్భనిరోధక మాత్రలను స్త్రీలు వేసుకోవాల్సిన పని అసలే ఉండదు. మగవారు ఎనిమిది వారాలకోసారి.. రెండు హార్మోన్‌ ఇంజక్షన్లు వేయించుకుంటే చాలు.. గర్భం వస్తుందన్న భయం లేకుండా.. శృంగారంలో మునిగితేలవచ్చు! హార్మోన్‌ ఇంజక్షన్లతో మగవారిలో స్పెర్మ్‌ కౌంట్‌(శుక్రకణాల సంఖ్య)ను తగ్గిపోయేలా చేయవచ్చని ఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ శాస్త్రవేత్త మన్మోహన్‌ మిస్రోతో కూడిన అంతర్జాతీయ బృందం వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన మారియో ఫిలిప్‌ అనే శాస్త్రవేత్తతో కలిసి మిస్రో చేసిన పరిశోధనల్లో ఈ విషయం రుజువైంది. ఈ ఇంజక్షన్లు తీసుకున్నవారిలో నలుగురి భార్యలకు మాత్రమే గర్భం వచ్చిందని, సుమారుగా 96 శాతం సమర్థంగా పనిచేశాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా, వీటివల్ల కూడా కండరాల నొప్పి, మొటిమలు వంటి పలు దుష్ప్రభావాలు రావడంతో వాటిని నివారించేందుకు తదుపరి పరిశోధనలు కొనసాగిస్తున్నారు.